సెప్టెంబర్​ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో జరపాలి

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని కేంద్రం  అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్​ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో .. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు జరపడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్​ అన్నారు.  గత ప్రభుత్వంలో కేసీఆర్ సమైక్యతా దినోత్సవం అంటే.. కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రజాపాలన అంటుందన్నారు.  ప్రజా పాలన దినోత్సవంలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందన్నారు. విమోచన దినోత్సవం అని పేరు మారిస్తే ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తానని అన్నారు.

విమోచన దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రతి ఒక్కరూ చూడాలని కేంద్రమంత్రి బండి సంజయ్​ అన్నారు.  నిజాం పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు, పోరాటాలు,  మహిళల మీద జరిగిన దాడులు , పరకాల, బైరాన్ పల్లి, నిర్మల్ ఘటనలను ప్రజల కళ్లకు కట్టిన విధంగా ఫొటో ఎగ్జిబిషన్​ ను ఏర్పాటు చేశామన్నారు.  చాకలి ఐలమ్మ, కొమరం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఎందరో నిజాం కు వ్యతిరేకంగా పోరాడారన్నారు.  

గతంలో ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపలేదన్నారు.   విమోచన దినోత్సవానికి స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ .. ఆయన నిజాం మెడలు వంచి  తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించారన్నారు.  నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన వీరుల చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్​ చేశారు.  అప్పటి రజాకార్ల దళమే ..  ఇప్పుడు ఎంఐఎం పార్టీగా ఆవిర్భవించిందన్నారు.