మహా ఎన్నికల్లో ఓటేసిన తెలంగాణ ఓటర్లు

  • తెలంగాణ, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం
  • 12 గ్రామాల ప్రజలకు ఇరురాష్ట్రాల ఓటరు కార్డులు

ఆసిఫాబాద్: మహారాష్ట్రలో ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వివాదాస్పదంగా ఉన్న 12 గ్రామాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూరా నియోజకవర్గ  పరిధిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు వేస్తున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని 12  గ్రామాల ప్రజలు ఎప్పుడు రెండు రాష్ట్రాల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో ఇరురాష్ట్రాల వైపు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఇక్కడి ఓటర్లకు ఇరురాష్ట్రాల ఓటరు కార్డులు ఉండటంతో రెండు చోట్ల ఓటు వేస్తున్నారు. గతేడాది నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో ఓటుహక్కు వినియోగించుకోగా.. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంతోపాటు మహారాష్ట్రలో ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లోనూ ఓటు వేశారు. ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. ఇరురాష్ట్రాల మధ్య నలుగుతున్న వివాదంతో ఇక్కడి ప్రజలు ఇరురాష్ట్రాల సంక్షేమ పథకాలతో పాటు ఇరురాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగిస్తున్నారు.