- రాష్ట్రంలో విపరీత వాతావరణ పరిస్థితులు.. పది జిల్లాల్లో 38 డిగ్రీలకుపైగా పగటి ఉష్ణోగ్రతలు
- 13 జిల్లాల్లో 10 డిగ్రీలకన్నాతక్కువగా రాత్రి టెంపరేచర్లు
- అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.9 డిగ్రీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విపరీత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం ఉంటుండగా.. ఆ తర్వాత ఎండ మంట పెరుగుతున్నది. సాయంత్రం 6 కాగానే టెంపరేచర్లు ఒక్కసారిగా పడిపోతున్నాయి. ఉదయం టెంపరేచర్లు సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయి. చాలా జిల్లాల్లో 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాత్రిపూట అన్ని జిల్లాల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంటున్నది. పలు జిల్లాల్లో టెంపరేచర్లు 10 డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. మరోవైపు, పగటిపూట టెంపరేచర్లు భారీగా పెరుగుతున్నాయి.
పది జిల్లాల్లో 38 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 38.7, మహబూబ్ నగర్‌లో 38.7, రంగారెడ్డిలో 38.6, మేడ్చల్ మల్కాజిగిరిలో 38.6, నిర్మల్‌లో 38.6, ఖమ్మం 38.4, హైదరాబాద్ 38.3, వనపర్తి 38.3, జయశంకర్ భూపాలపల్లిలో 37.8, భద్రాద్రి కొత్తగూడెం 37.8, వికారాబాద్ 37.3, ములుగు 37, మెదక్ 37.8, జనగామ 37.8, యాదాద్రి 37.8, నల్గొండ 37.4, సూర్యాపేట 37.4, కామారెడ్డి 37.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ 35 డిగ్రీల నుంచి 36 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి.
ALSO READ : ప్రైవేటు బడుల్లో 25 శాతం సీట్లు పేదలకు!
చలి పెరిగింది..
కొన్ని రోజుల పాటు తగ్గిన చలి.. సడన్‌గా పెరిగింది. రెండు మూడ్రోజుల నుంచి రాత్రి టెంపరేచర్లు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 6.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. కుమ్రంభీం జిల్లా గిన్నెదరిలో 7.2 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లాలో 8.1, ఆదిలాబాద్‌లో 8.5, వికారాబాద్‌లో 9, కామారెడ్డిలో 9.6, రాజన్న సిరిసిల్లలో 9.7, మహబూబ్ నగర్‌లో 9.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో నాలుగైదు జిల్లాల్లో 10, మరో 9 జిల్లాల్లో 11 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. వచ్చే నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.