హైదరాబాద్: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. అయితే ఈ తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో తెలంగాణకు భారీ వర్షాల గండం తప్పింది. నేటి (సోమవారం) నుంచి రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో చిరుజల్లులు, తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
తీవ్ర వాయుగుండం బంగాళాఖాతంలో పూరికి (ఒడిశా ) తూర్పు - ఆగ్నేయ దిశలో 50 కి. మీ., పరాదీప్కు (ఒడిశా ) నైరుతి దిశలో 90 కి. మీ. మరియు కళింగపట్నంకు (ఆంధ్రప్రదేశ్ ) తూర్పు - ఈశాన్య దిశలో 260 కి. మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా తీరాన్ని, పూరి వద్ద ఈరోజు సాయంత్రం తీరం దాటింది.
హైదరాబాద్లో ఈరోజు (సెప్టెంబర్ 9, 2024) వాతావరణం మేఘావృతంగా ఉండటానికి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండమే కారణంగా తెలిసింది. ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, గాలి గంటకు 30 నుంచి- 40 కి.మీ వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.