తెలంగాణలో చలి రోజురోజుకు పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే దిగువకు పడిపోయాయి. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
చలితో పాటు విపరీతమైన పొగ, మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రాష్ట్రంలో చలిగాలులు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నాయని.. దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని చెబుతున్నారు.
హైదరాబాద్‌తో పాటు ఏజెన్సీ జిల్లాలైన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాయి. ఉదయం 9 గంటలు దాటినా మంచు పోవడం లేదు.. రోడ్లు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.