గద్వాల, వెలుగు: కల్వకుంట ఫ్యామిలీ చేతుల్లో బందీగా మారిన తెలంగాణను విముక్తి చేద్దామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పిలుపునిచ్చారు. సోమవారం గ్రామ గ్రామాన బీజేపీ జెండా కార్యక్రమంలో భాగంగా ధరూర్ మండలం ఉప్పేర్, గార్లపాడు, ఖమ్మంపాడు, వామనపల్లి, చింతరేవుల తదితర గ్రామాల్లో బీజేపీ జెండాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం కమీషన్ల పర్వం జోరుగా సాగుతుందని చెప్పారు.
ఏ పనికి బిల్లులు రావాలన్నా 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంతో పాటు నడిగడ్డ బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, రాజేశ్, రాంచంద్రారెడ్డి, డీటీడీసీ నరసింహ, సంజీవ్ భరద్వాజ్, మిర్జాపురం వెంకటేశ్వర్ రెడ్డి, అనిమిరెడ్డి, అంజి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.అచ్చంపేట: బీజేపీ పాలనలో దేశం అన్నిరంగాల్లో ముందుకెళ్తుందని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ రాగి రామకృష్ణారెడ్డి తెలిపారు.
మండలంలోని హాజీపూర్ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు అంజనేయులు అద్యక్షతన మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపీ సర్కారు చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నరేందర్‌రావు, శ్రీకాంత్భీమా, కృష్ణయ్య, బాలకృష్ణ, శివాజీ పాల్గొన్నారు.