మిగులు బడ్జెట్తో అలరారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎందుకు దిగజారింది?

ప్రజలకు, పాలకులకు సంక్షేమ పథకాలే సర్వస్వం అయినప్పుడు ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే మిగతా అన్ని విషయాలు చాలా చిన్నగా కనిపిస్తాయి. తమకు విద్య, వైద్యం, ఉపాధి నైపుణ్యాలు అవసరం అనే స్పృహ ప్రజలు విస్మరిస్తే, పాలకులు తాత్కాలిక తాయిలాలతో ప్రజలను ఏమార్చి, పబ్బం గడుపుకుంటారనే విషయం తెలంగాణ రాష్ట్రంలో రుజువైంది. ఉద్యమ ఫలాలను అందుకోవడంలో తెలంగాణ సమాజం దారుణ పరాభవాన్ని రుచి చూసింది. తెలంగాణ రాష్ట్రం సాకారమైతే ప్రజల జీవితాలు గణనీయంగా పురోభివృద్ధి సాధిస్తాయని నమ్మబలికిన నాయకత్వమే గత 9 ఏండ్లుగా పాలక పక్షంలో కూర్చొని తెలంగాణను ఏలుతున్నది. అపారమైన సహజ వనరులు, బహుళ ఆదాయ మార్గాలు, మిగులు బడ్జెట్ తో తులతూగిన తెలంగాణ ఖజాన నేడు లోటుతో కునారిల్లుతున్నది. చిన్నచిన్న బిల్లులు మొదలు ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పెన్షన్లు కూడా చెల్లించలేని పరిస్థితులు దాపురించినట్లు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం కనిపిస్తున్నది.

దుబారా, ఆధిపత్యం..

మిగులు బడ్జెట్ తో అలరారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎందుకు దిగజారింది? అప్రధాన, అనుత్పాదక వ్యయాలకు విపరీతమైన నిధులు కేటాయించడం ఒక ముఖ్యమైన తప్పిదంగా చెప్పవచ్చు. కుల, మతాల వారీగా కేటాయింపులు జరిపి అనాలోచితంగా ఖర్చులు చేయడం, అనవసర హంగులు, ఆర్భాటాలకు పోయి ప్రచారాలు నిర్వహించడం,  ప్రజలు కోరుకున్న వాటి కంటే కూడా, కోరని వాటిని ముందుగా నెరవేర్చడం వల్ల ప్రత్యేకత చాటుకునే ప్రయత్నాలు చేశారు. అంతటితో ఆగకుండా ఉద్యోగులు అడిగిన దానికంటే కూడా పక్క రాష్ట్రాలతో పోల్చుకొని ఒక శాతం ఎక్కువ ఇచ్చే ‘ఆధిక్యత, ఆధిపత్య భావం’ కూడా ఈ పరిస్థితులకు కారణం. ప్రణాళిక లేకుండా పనులు చేపట్టి వాటిని మధ్యలోనే ఆపి, కొత్త పనులు మొదలు పెట్టడం వల్ల అనేక వనరులు వృథా అయ్యాయి. అవసరం ఉన్న దానికంటే పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టడం తద్వారా రాష్ట్రం మొత్తంలో జరగాల్సిన నిర్మాణాలను, అభివృద్ధిని, నిధులను తనకు నచ్చిన ప్రాంతానికే కేంద్రీకృతం చేయడం జరిగింది. ఉదాహరణకు గజ్వేల్ స్వయానా సీఎం నియోజకవర్గం కావడం అనే ఒకే ఒక్క అర్హత వల్ల విశృంఖల, విధ్వంసక అభివృద్ధి ప్రణాళికలు రచించారు. విచక్షణ లేకుండా అమాంతం నిధులు కేటాయించారు. దాదాపు రూ. 500 కోట్ల వ్యయంతో ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణం జరిపారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రభుత్వ విద్యాలయాలు, కాలేజీలు కనీస అవసరాలకు దూరంగా మౌనంగా రోదిస్తున్నాయి.  అదే గజ్వేల్ పాత బస్టాండ్ ను రూ. 50 లక్షలతో అధునాతనంగా మార్చి, వారం రోజులు తిరగకముందే కూల్చివేయడం, అదే స్థలంలో మార్కెట్ యార్డును నిర్మించడం.. రాజు తలచుకుంటే ప్రజాధనం ఎలా దుబారా చేయగలడో రుజువుచేస్తున్నది. 

ఇప్పుడేం చేయాలి?

చేతులు కాలాకనైనా ఆకులు పట్టుకోవడం విజ్ఞత అనిపించుకుంటుంది. యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. అది ముందుగా రాష్ట్రంలో అత్యున్నత ప్రజాప్రతినిధులుగా ఉన్న వారితోనే మొదలు కావాలి. ఎమ్మెల్యేల, మంత్రుల జీతభత్యాలు హేతుబద్ధీకరించాలి. కాంట్రాక్టుల్లో భారీ ఎత్తున జరుగుతున్న అవినీతిని అరికట్టే శాశ్వత ఏర్పాట్లు చేయాలి. సంక్షేమ పథకాల పేరిట జరుగుతున్న ఖర్చులను, ఎన్నికల గెలుపు కోసమే ప్రవేశపెట్టిన పథకాలను వీలైనంత త్వరగా వెనక్కుతీసుకోవాలి. ప్రజలు ఎదిగే సంక్షేమ పథకాలు మాత్రమే కొనసాగించాలి. ప్రజలు తమ సొంత కాళ్ల మీద నిలబడే అవకాశాలను కల్పించాలి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం లో జరుగుతున్న విపరీతమైన ఖర్చు స్థానంలో ‘దక్షిణ కొరియా మార్గం’లో వివిధ రకాలుగా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ రాకముందే ఈ చర్యలు చేపట్టడం అనివార్యం. పొరపాట్లు చేయడం కంటే వాటిని దిద్దుకునే ధైర్యం, నిజాయితీ గొప్పవి. మరి ఆ సత్తా మన ప్రభుత్వానికి ఉందా? అనేదే అంతిమ ప్రశ్న.


ఏకవ్యక్తి పాలనతో ఆర్థిక వ్యవస్థ అధోగతి

చిన్న రంధ్రమైనా పెద్ద పడవను ముంచిన చందంగా తెలంగాణ విషయంలో ఇలాంటి పొరపాట్లు పెద్ద ఎత్తున జరిగాయి. పొరపాట్లు కుప్పగా పేరుకున్న ఫలితంగా ఆర్థిక పరిస్థితి దుర్లభంగా మారింది. ఆర్థిక మాంద్యాలన్నీ మానసిక మాంద్యాలే.  మానసికమైన అంశాలు ఆర్థిక వ్యవస్థను శాసిస్తాయి. అది కుటుంబ స్థాయి కావచ్చు, రాష్ట్ర, జాతీయ స్థాయి కావచ్చు. అహంకారం, ఆధిపత్య ధోరణి, కేంద్రీకృత పాలన, నియంతృత్వ ధోరణులు ఉన్నతస్థాయి నాయకత్వ మానసిక అంశాలు అయినప్పుడు ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలుకావడం సహజమైన ప్రతిచర్య. ఏక వ్యక్తి పరిపాలన అంతా చివరికి అనేక రకాలైన సంక్షోభాలను సృష్టిస్తుంది. తాత్కాలిక తాయిలాలలో సమాజం మునిగిపోతే, ప్రశ్నించే గొంతులది కూడా అడవి రోదనగానే మిగిలిపోతది. ఓట్లను రాల్చే ప్రజాకర్షక పథకాలు వేరు, ప్రజలను ఆర్థికంగా ఎదిగించే పథకాలు వేరు. మొదటి కోవకు చెందినవి ప్రజలను తాత్కాలికంగా సంతోష పరుస్తాయి. తెలంగాణ పాలన మొదటి కోవలోనే నడుస్తున్నది. అవినీతి అంతం అంటూ వ్యవస్థ ప్రక్షాళన మొదలుపెట్టి ఆదిలోనే హంస పాదు చేశారు. అవినీతి విషయంలో దేశంలోనే అగ్ర స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం అధిరోహించింది. ప్రభుత్వ పనుల్లో, కార్యకలాపాల్లో అవినీతి అంతం కాకపోతే, పాలకుల కమీషన్​లు ఆగకపోతే.. ఖజానా ఖాళీ కాకుండా ఉంటదా?

- కె. శ్రీనివాసాచారి సోషల్​ ఎనలిస్ట్