బీజేపీ నేతలు చెప్పిందే రాష్ట్ర గవర్నర్ చేస్తున్నరు : గంప గోవర్ధన్

రాముని పేరు చెప్పి బీజేపీ నేతలు ఎన్ని రోజులు రాజకీయం చేస్తారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్ కూడా బీజేపీ నేతలు చెప్పిందే ఇక్కడ అమలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేస్తున్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానంటూ గంప గోవర్ధన్ సవాల్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని, దీనిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో మాత్రమే జరుగుతున్నాయని గంప గోవర్ధన్ అన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇప్పటికే 95 శాతం పూర్తి చేశామని చెప్పారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా.. 96 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. బయటి నుంచి తీసుకొచ్చిన అప్పులతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గంప గోవర్ధన్ తెలిపారు.