
హైదరాబాద్, వెలుగు: ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మరో పదేండ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో ఆదివారం ఉగాది వేడుకలు నిర్వహించారు. శ్రీనివాస్‌మూర్తి ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చదివించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ యాదవ్ హాజరయ్యారు. పంచాగ శ్రవణం అనంతరం మహేశ్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
విశ్వవసు సంవత్సరంలో రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరగాలని, ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేబినెట్ మంత్రులు.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, పెట్టుబడులు పెట్టేందుకు విదేశీయులు ముందుకొస్తున్నారని అన్నారు. మనం పండిస్తున్న సన్నబియ్యం ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తున్నామని గుర్తుచేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశంలో ఖర్గే, రాహుల్, సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ముందుకెళ్తోందన్నారు.