అదే పరిస్థితి వస్తే ఇంటింటికీ నిత్యావసర వస్తువులు అందిస్తం: సీఎం
హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు అవసరమైతే రాష్ట్రాన్ని షట్ డౌన్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వైరస్ వ్యాప్తి చెందుకుండా ప్రభుత్వం పకడ్బందీగా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నదన్నారు. ఒకవేళ పరిస్థితి చేయిదాటితే రాష్ట్రంలో అన్నిటినీ మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అన్నిటినీ మూసివేస్తే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసిందని శనివారం ప్రెస్మీట్లో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని షట్ డౌన్ చేసే పరిస్థితి వస్తే ప్రతి ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే విషయంపై అధికారులతో సమీక్ష జరిపామన్నారు. ‘‘మేం చాలా డీప్‌గా పోతా ఉన్నాం.. కానీ బయటికి చెప్తలేం. అవసరమైతే ప్రతి ఇంటికీ రేషన్ పంపడంపైనా ఆలోచన చేస్తున్నం. అందుకు ఐదారు వేల వెహికల్స్ రెడీగా ఉన్నయ్. ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తం. అవసరమైతే రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా వెనుకాడం.. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నయ్. ప్రజలను కాపాడుకుంటం’ అని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ‘‘షట్‌డౌన్ చేసే పరిస్థితి వస్తే అన్ని కార్యక్రమాలను సస్పెండ్ చేసి.. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది’’ అని తెలిపారు. వైన్ షాపుల ముందు లిక్కర్ కోసం జనాలు గుంపులుగా ఉండటం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అయితే ఒకేసారి అన్నిటినీ మూసివేయడం సరికాదన్న ఆలోచనతో ఉన్నామని చెప్పారు. ‘‘కార్మికులు ఎక్కడైనా ఇబ్బందులు పడితే గద్దలాగా వాలిపోతం. మనది అంత పేద రాష్ట్రం కాదు. అవసరమైతే వెయ్యి కోట్లు ఖర్చు పెడుతం. రేషన్ కావాల్నంటే పంపిణీ చేస్తం. మన బిడ్డలను మేం ఆదుకుంటం’’ అని తెలిపారు.
వాళ్లు కూడా మా బిడ్డలే
వివిధ పనుల కోసం విదేశాలకు వెళ్లి రాష్ట్రానికి వచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మెడికల్ టెస్టులు చేయించుకోవాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు విదేశాల నుంచి 20 వేల మంది వచ్చారని ఆయన తెలిపారు. ‘‘శుక్రవారం రాత్రి ఒకరోజే 1,500 మందికి పైచిలుకు మంది విదేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో దిగేవాళ్లతో సమస్య లేదు.. ఇతర రాష్ట్రాల్లో దిగివచ్చే వారు ఎట్లా వస్తున్నరో తెలియడం లేదు. అక్కడే సమస్య ఉంది. ఇప్పటి వరకు 11 వేల మందికి పరీక్షలు చేసి ఆధీనంలోకి తీసుకున్నం’’ అని వివరించారు. ‘‘విదేశాల నుంచి వచ్చినవాళ్లందరికీ నేను చేతులెత్తి దండం పెట్టి అప్పీల్ చేస్తున్న. మీరూ మా బిడ్డలే.. మావోళ్లే.. మీరు కొంచెం ప్రభుత్వం చెప్పినట్లు వినాలే. సమాజహితం కోరి కో ఆపరేట్ చేయాలె. ప్రపంచం ప్రపంచమే పరేషాన్లో ఉన్న టైంలో నియంత్రణ లేకపోతే ఎట్ల. చేతుల ఉన్నంత వరకు చేయాలే.. ఆ తర్వాత భగవంతుడి దయ. దయ చేసి మీరు వాలెంటరీగా రిపోర్ట్ చేయండి. కుటుంబసభ్యులు కూడా తమ తమ కుటుంబంలో ఎవరైనా ఫారిన్ నుంచి వస్తే రిపోర్టు చేయండి. ఇది సామాజిక బాధ్యత.. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే తక్షణమే రిపోర్టు చేయాలి. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నా రిపోర్టు చేస్తే అందరికీ మంచిది’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇతర దేశాల నుంచి వచ్చినవాళ్లు ఎమ్మెల్యేలైనా సరే, మంత్రులైనా సరే, సీఎం అయినా సరే అధికారులకు రిపోర్టు చేయాల్సిందేనని, సూచనలు పాటించాల్సిందేనని చెప్పారు. రాష్ట్రానికి ఆరేడు శాల నుంచి మత ప్రచారకులు వచ్చారని, ఇట్ల 67 మంది ట్రేస్ అయ్యారని తెలిపారు.
హోమాలు చేస్తే ఎంకరేజ్ చేస్తం
కరోనా వైరస్ నివారణకు కొందరు హోమాలు చేస్తున్నారని, అలాంటి వారిని ఎంకరేజ్ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దేవాలయాల్లో పూజలు యథావిధిగా జరుగుతున్నాయని, భక్తులను మాత్రం అనుమతించడం లేదని తెలిపారు.
బార్డర్లు మూసేస్తాం
పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కరోనా వైరస్ విస్తృతంగా విస్తరిస్తోందని, ఆ రాష్ట్ర సరిహద్దులను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘‘రెండు మూడు రోజులు చూస్తం.. పరిస్థితి చేయి దాటుతది అంటే అన్ని రాష్ట్రాల బార్డర్లను మూసేస్తం. మహారాష్ట్రతో మనకు ఐదారు వందల కి.మీ.ల బోర్డర్ ఉంది. అక్కడ సమస్య తీవ్రంగా ఉంది. తీవ్రతను అంచనా వేసి రెండుమూడు రోజుల తర్వాత సమీక్షించి.. ఆ బోర్డర్ మొత్తం క్లోజ్ చేద్దామనుకుంటున్నాం. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వాళ్లకు మహారాష్ట్రతో క్లోజ్ రిలేషన్స్ ఉన్నయ్. అట్ల వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది’ అని పేర్కొన్నారు.
కేసీఆర్ బతికున్నంత కాలం ఎవరికీ ఏం కాదు
కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘‘విపత్కర పరిస్థితులు వస్తే ఏం చేయాలో కూడా మేం మాట్లాడుకున్నం. కేసీఆర్ బతికున్నంత కాలం ఎవరికీ ఏం కాదు. ఏ చిన్న ఇబ్బంది రాకుండా చూస్తం. ప్రజలు నయా పైసా ఖర్చు పెట్టుకోకుండా.. అన్నీ ప్రభుత్వమే భరిస్తది’’ అని భరోసా ఇచ్చారు.
For More News..