కేసీఆర్​  తెలంగాణ అస్థిత్వ రాజకీయాన్ని వదులుకున్నట్లేనా

తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ను భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నాక  కేసీఆర్​  తెలంగాణ అస్థిత్వ రాజకీయాన్ని వదులుకున్నట్లేనా అని చాలా మంది విశ్లేషకులు, రాజకీయ నాయకులు చర్చిస్తున్నారు. వదులుకున్నట్లే కదా అని   తేల్చేస్తున్నారు కూడా. వాస్తవానికి తెలంగాణ అస్తిత్వ రాజకీయం పేరుతో కేసీఆర్​ తన రాజకీయాలను చెలామణి చేసుకున్నారు. కానీ అస్తిత్వ రాజకీయ ‘పత్యం’ను ఏనాడూ పాటించిన దాఖలా మాత్రంలేదు. ఎనిమిదేండ్లుగా  కేసీఆర్​ చేసింది ఫక్తు రాజకీయమే తప్ప అస్తిత్వ రాజకీయం కాదు.

కాబట్టి, అస్తిత్వ రాజకీయాన్ని ఆయన  వదులుకోవడం అనేది అసలు చర్చనీయాంశమే కాదని చెప్పొచ్చు. టీఆర్​ఎస్​ అయినా బీఆర్​ఎస్​ అయినా అందులో  ఫక్తు తప్ప అస్తిత్వం  ఉంటదని ఆశించడమే అత్యాశ.  తనకు రాజకీయంగా ఆపద వచ్చినపుడు మాత్రం అస్తిత్వాన్ని  తప్పక ఆశ్రయిస్తారు. అందుకే టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా మారుస్తూ పార్టీ తీర్మానం ఆమోదించాక కేసీఆర్​ చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్లు గమనించదగ్గవి. సీఎంగా తాను  కొనసాగుతూనే  ఉజ్వల భారత్​ కోసం పనిచేస్తా అన్నారు. అదే సమయంలో నా కార్యక్షేత్రం మాత్రం తెలంగాణే అని చెప్పుకోవడం గమనార్హం.  

పాలనలోనే అస్తిత్వం లేదు

రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన మరునాడే, ఇక నుంచి టీఆర్​ఎస్​ ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయపార్టీ అని స్వయాన కేసీఆర్​ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. విభజన బిల్లులో ఉన్న  అంశాలను తన రాజకీయ అవసరాల పరిధిలో చూశారు తప్ప అస్తిత్వ పరిధిలో ఎన్నడూ చూడలేదు. నీళ్ల పంపకం, ఉద్యోగుల పంపకం, నిధుల పంపకం యధాలాపంగా జరిగినవే తప్ప సీఎంగా కేసీఆర్​ తెలంగాణ ప్రయోజనాల కోసమంటూఅందులో  పోరాడి  సాధించింది ఏమీ లేదు. ఉద్యోగుల పంపకం  స్థానికత ఆధారంగా జరగకపోయినా.. అస్తిత్వ నాయకుడిగా ముఖ్యమంత్రిగా  పంపకాలను పట్టించుకున్న దాఖలాలేదు.

సరికదా.. పంపకాల్లో ఏ కొద్ది మందో  తెలంగాణ ఉద్యోగులు ఏపీకి వెళ్లినా వారిని తిరిగి వెనక్కి తెప్పించే పనిచేశారు తప్ప, తెలంగాణలోనే  కొనసాగుతున్న ఆంధ్రా ఉద్యోగులను మాత్రం ఏపీకి పంపే ప్రయత్నమే చేయకపోవడం గమనించొచ్చు. కేసీఆర్​ అస్తిత్వ రాజకీయం ఏపాటిదో ఉద్యోగుల పంపకాలలోనే తేలిపోయింది.  ఈ రోజుకూ తెలంగాణ సచివాలయంలో, ప్రభుత్వశాఖల్లో  కీలక స్థానాల్లో ఆంధ్రా ఉద్యోగులే కొనసాగడం చూస్తే..  కేసీఆర్​ది అస్తిత్వ పాలన అని ఎవరంటారు?

రెండు జీవనదులపై విభజన బిల్లు యాజమాన్య బోర్డులు పెట్టింది.  అందులోనూ ఎలాంటి వివాదాలు లేని గోదావరిపై పెట్టిన బోర్డునయినా రద్దు చేయాలని కేసీఆర్​ గట్టిగా డిమాండ్​ చేసిన దాఖలా లేదు. ఇలా ఉద్యోగుల పంపకాల్లో అయినా, నదులపై పెట్టిన యాజమాన్య బోర్డులపైన అయినా  కేసీఆర్​ ఒక  తెలంగాణ అస్తిత్వ  ముఖ్యమంత్రిగా పోరాడింది ఎన్నడూ లేదు. సాధించింది అంతకన్నా లేదు.  

పక్క రాష్ట్రం కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై ‘వెలుగు’ వంటి పత్రిక వార్త రాస్తే తప్ప స్పందించిన దాఖలా లేదు.  రోజా ఇంటికి వెళ్లి చేపల పులుసు భోజనం చేసి, రాయలసీమను రతనాల సీమ చేస్తామన్న కేసీఆర్​కు.. తెలంగాణకు దక్కాల్సిన  కృష్ణా నీళ్లపై ఉన్న ఆసక్తి ఏమిటందాం?  విభజన ప్రక్రియ దయ, తెలంగాణ ప్రాప్తం అన్నట్లు పంపకాలు జరిగాయి.

అస్తిత్వ రాజకీయం కేసీఆర్​ అధికారానికి దారులువేసింది, కానీ కేసీఆర్​ మాత్రం తనదైన  ఫక్తు రాజకీయంలోనే  జీవించారు. జీవిస్తున్నారు. టీఆర్​ఎస్​గా కొనసాగుతూ అస్తిత్వాన్ని నిలబెట్టింది లేదు..ఇపుడు బీఆర్​ఎస్​తో అస్తిత్వాన్ని అడ్డంగా వాడుకునే అవకాశమూ ఉండదు. కేసీఆర్​  తెలంగాణ సెంటిమెంటును ఓటుగా మార్చుకునే దశ దాటిపోయింది. తెలంగాణ అస్తిత్వంలో ఎదిగిన నాయకులు, ఉద్యమకారులు వివిధ పార్టీలలో చేరిపోయారు.   ఇపుడు తెలంగాణ అస్తిత్వ రాజకీయాలు ఎవరి సొంతమో కాదు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ పార్టీ చిత్తశుద్దితో పనిచేస్తే ఆపార్టీయే  అస్తిత్వంగా భావించే కాలం వచ్చేసింది.

దేశానికి తెలంగాణ మోడల్​ ఇదేనా?

లక్ష కోట్ల పెట్టుబడితో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టును  కేసీఆర్ తన​ మానస పుత్రిక అని పొలిటికల్​ క్యాంపెయిన్​ చేసుకున్నారు తప్ప కొత్త ఆయకట్టు పెరిగింది లేదు. నలభై వేల కోట్ల పెట్టుబడితో చేపట్టిన మిషన్​ భగీరథ  కేసీఆర్​ రాజకీయ ప్రచారానికి ఉపయోగపడినంతగా.. ఆ నీళ్లు ప్రజలు తాగడానికి మాత్రం ఉపయోగపడుత లేవు.  మిషన్​ కాకతీయ అసంపూర్ణం. కాంట్రాక్టర్లు, దళారుల జేబులు సంపూర్ణం. అర్భాటాలు, ఆడంబరాలకు కొదవలేదు. కాళేశ్వరంపై ఒక  ఇంటర్నేషనల్​ టీవీ చానెల్లో ప్రసారం చేయించుకున్నారు.

ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల పథకమని ప్రచారం చేశారు. తీరా వరదల్లో మునిగిన కాళేశ్వరం చూసి, ఆ చానెల్​ కాళేశ్వరం  వీడియోను డిలిట్​ చేయడం కొసమెరుపు.  భూములను డిజిటలైజ్​ చేశామన్నారు. ధరణి పోర్టల్​లో పెట్టారు. ప్రతి గ్రామంలో సుమారు 200 మంది రైతులు ధరణి బాధితులుగా మారారు. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పరిష్కారాలు లేవు. ప్రయత్నాలూ లేవు.  సమీక్షలు అంతకన్నా లేవు. భూయజమానులు అనాథలుగా మారారు. భూములు అస్తవ్యస్తం. కబ్జాదారులకు పండుగలా మారింది.

ల్యాండ్​ మార్క్​  అభివృద్ధి ప్రాజెక్టులుగా కాళేశ్వరం, మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయ, ధరణిలను  ప్రచారం చేసుకున్నారే తప్ప ఏ ఒక్క  ప్రాజెక్టులోనైనా  సక్సెస్​ కనిపిస్తున్నదా? ప్రజలు ప్రయోజనం పొందుతున్నారా? అంతటా ఫెయిల్యూర్స్​​ తప్ప ఫలితాలు కనిపించవు. రేపు బీఆర్​ఎస్ జాతీయ పార్టీగా దేశానికి అందించబోయే తెలంగాణ మోడల్​ ఇదేనా? జాతీయ మీడియాలో ప్రచార ప్రసారాలు, దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రచారాల ఫ్లెక్సీలు మాత్రం  కనిపిస్తాయి.  సంక్షేమంలోనైనా, అభివృద్ధిలోనైనా ఎందెందు వెదికి చూసినా అందందే కేసీఆర్​ ప్రయోజనాలు  కనిపిస్తాయి తప్ప ప్రజల ప్రయోజనాలు కనిపించవు.

ఎనిమిదేళ్ల పరిపాలనలో  సెంటిమెంట్​కు కాలం చెల్లిపోయింది. గడిచిన 4 ఏండ్ల కాలమంతా రాజకీయాలకే ఖర్చయిపోయింది.  పరిపాలన పడకేసింది.  ఇంటి రాజకీయం  వర్కవుట్​ కావడంలేదు. టీఆర్​ఎస్​ పేరును బీఆర్​ఎస్​గా మార్పుపై  ఆ పార్టీ క్యాడర్​లోగానీ, ఆ పార్టీ ప్రజాప్రతినిధులలో  గానీ ఎక్కడా ఆనందోత్సాహాలేమీ కనిపించడంలేదు. ముభావం, ముసి ముసి నవ్వుల జవాబులే కనిపిస్తున్నాయి. 

ప్రశంసలు చెప్పించుకోవడం, పాలభిషేకాలు చేయించుకోవడం తెలిసినవే.  రాష్ట్రంలో ఏం మెరిసిపోతున్నదని కేసీఆర్​ జాతీయ పార్టీ పెడుతున్నాడనే చర్చ తెలంగాణ ప్రజల్లో సర్వత్రా వినిపిస్తున్నది, కనిపిస్తున్నది. పార్టీ పేరులోనే ‘ తెలంగాణ’పదాన్ని తొలగించిన కేసీఆర్.. ​తెలంగాణే నా కార్యక్షేత్రంగా ఉంటదని చెప్పడం ఆయనలో దాగి ఉన్న రాజకీయ అభద్రతా భావానికి అద్దం పడుతుంది.

పథకాల ఫలితాలేవి?

కేసీఆర్​ను అస్తిత్వ నాయకుడనే కాలం దాటిపోయింది.  ఆ కథ2019 నుంచే మొదలైంది.  అర్భాటాలు, అసమర్థతలు ఒకటొకటిగా ప్రజలకు అర్థమవుతూ వచ్చాయి. ప్రస్తుతం  పరిపాలనలో కొత్తగా చెప్పడానికి ఏమీ మిగలని పరిస్థితి. చెప్పినవి అమలు జరుగని దుస్థితి. అంతా బాగుందనే పాజిటివ్​ క్రియేషన్​ వర్కౌట్​ కాని కాలం మొదలైంది. కొత్తగా చెప్పడానికి బ్రహ్మాస్త్రాలు ఏమీ మిగలలేదు.  భారీ నగదు పథకాలు ప్రకటించినా వాటి అమలుపై ప్రజల్లోనే అనుమానాలు మొదలైనాయి. హామీలు కుమ్మరించడమే తప్ప అమలు విషయానికి వచ్చే సరికి అవి పైలెట్​ పథకాలుగా మిగిలిపోతుంటాయి.

దళిత బంధు పథకం చివరి దళితుడి వరకు దక్కాలంటే మరో రెండు దశాబ్దాలు పట్టొచ్చు. ఇప్పుడు గిరిజన బంధు కూడా మరో పైలెట్​ ప్రాజెక్టుగా మిగిలిపోవచ్చు.  డబుల్​ బెడ్​ రూం ఇళ్ల పథకం పేదల్లో బోలెడు ఆశలు రేపింది. ఎనిమిదేళ్లు గడిచాక కూడా అది పేదలను  ఉసూరు మనిపించింది. భారీ హామీలు, పాలభిషేకాలు పాలపులారిటీని ఎల్లకాలం నిలబెట్టలేవు.

గ్రౌండ్​ రియాలిటీని ప్రజలు ఇప్పటికే గమనించారు. వ్యక్తిగత పాపులారిటీ ట్రిక్కులు తప్ప పథకాల్లో తెలంగాణ సామాజిక ఎదుగుదల కనిపించదు. ఆయా సమాజికవర్గాలకు ఆత్మ గౌరవ భవనాలు కట్టిస్తామనడమే అందుకొక ఉదాహరణ.  ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కావలసింది సామాజిక భవనాలు కాదు, నాణ్యమైన విద్య కావాలి. అందుకే  ఎక్కడ చూసినా కేసీఆర్​ రాజకీయ అభివృద్ధి  తండ్లాట కనిపిస్తుంది తప్ప, తెలంగాణ సమగ్రాభివృద్ధి ఎక్కడా కనపించందు. ప్రణాళికా బద్ధమైన పాలన లేదు. కల్లూరి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్.