రెండు వారాల్లో డీపీఆర్‌‌లు సమర్పిస్తామన్న తెలంగాణ

రెండు వారాల్లో డీపీఆర్‌‌లు సమర్పిస్తామన్న తెలంగాణ
  • పాలమూరును ఎడారి చేసే ఆర్డీఎస్‌‌ కుడి కాల్వకు తెలంగాణ ఓకే
  • కేఆర్‌‌ఎంబీ మీటింగ్‌‌లో అంగీకారం తెలిపిన అధికారులు
  • తుమ్మిళ్ల లిఫ్ట్‌‌ ఆపరేషన్‌‌ కూడా నిలిపివేస్తామని హామీ
  • మీటింగ్‌‌ మినిట్స్‌‌ను తాజాగా రిలీజ్‌‌ చేసిన కృష్ణా బోర్డు
  • శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తిపై తెలంగాణను నిందించిన ఏపీ
  • దీటుగా బదులివ్వలేకపోయిన రాష్ట్ర అధికారులు


హైదరాబాద్‌‌, వెలుగు: గద్వాల, అలంపూర్‌‌ను ఎడారిగా మార్చేలా ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్‌‌ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) రైట్‌‌ కెనాల్‌‌కు తెలంగాణ సర్కారు ఓకే చెప్పింది. ఆర్డీఎస్‌‌ ఆయకట్టుకు భరోసానిచ్చేందుకు నిర్మించిన తుమ్మిళ్ల లిఫ్ట్‌‌ స్కీం ఆపరేషన్‌‌ కూడా ఆపేస్తామని మాట ఇచ్చింది. దీంతో ఏపీ అక్రమంగా 10 టీఎంసీలు తరలించుకుపోయి.. ఆర్డీఎస్‌‌కు ఇప్పుడు వస్తున్న 6 టీఎంసీల నీళ్లు కూడా అందకుండా చేసే అక్రమ ప్రాజెక్టుకు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చినట్లయింది. ఈనెల ఆరో తేదీన నిర్వహించిన కేఆర్‌‌ఎంబీ 16వ మీటింగ్‌‌ మినిట్స్‌‌ను బోర్డు మెంబర్‌‌ రవికుమార్‌‌ పిళ్లై శుక్రవారం రాత్రి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు పంపారు. ఆర్డీఎస్‌‌ రైట్‌‌ కెనాల్‌‌ పనులకు ఆమోదం చెప్పడంతోపాటు, తుమ్మిళ్ల ఎత్తిపోతలు నిలిపివేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన అధికారులు అంగీకారం తెలిపినట్లు ఈ మినిట్స్ ద్వారా వెల్లడైంది. తుంగభద్ర బోర్డు పరిధిలో ఉన్న ఆర్డీఎస్‌‌ అంశాన్ని కృష్ణా బోర్డు ఎజెండాలో చేర్చి చర్చించాలని తెలంగాణ ప్రభుత్వమే పట్టుబట్టింది. దీంతో ఈ అంశాన్ని కేఆర్‌‌ఎంబీ మీటింగ్‌‌ ఎజెండాలో చేర్చిన అధికారులు తెలంగాణ, ఏపీ, కర్నాటక రాష్ట్రాలతో పాటు తుంగభద్ర బోర్డు అధికారులను సమావేశానికి ఆహ్వానించారు. ఈ ఏడాది జనవరి 28న ఆర్డీఎస్‌‌ను బోర్డు టీం విజిట్‌‌ చేసింది. అక్కడ తమ పరిశీలనకు వచ్చిన అంశాలపై బోర్డు మెంబర్‌‌ రవికుమార్‌‌ పిళ్లై ప్రజంటేషన్‌‌ ఇచ్చారు. బోర్డు మీటింగ్‌‌లో రాష్ట్రాల మధ్య వచ్చే ఏకాభిప్రాయం మేరకు ఆర్డీఎస్‌‌ సమస్యకు పరిష్కారం చూపిస్తానని ఆయన వివరించారు. ఏపీ ఇరిగేషన్‌‌ సెక్రటరీ మాట్లాడుతూ, బోర్డు ప్రతిపాదించే రోడ్‌‌ మ్యాప్‌‌ అమల్లోకి వచ్చాక తెలంగాణ చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను నిలిపివేయాలని కోరారు. ఏపీ ఈఎన్సీ మాట్లాడుతూ, ఆర్డీఎస్‌‌ మోడ్రనైజేషన్‌‌కు తాము సంపూర్ణ సహకారం అందిస్తామని, ప్రతిగా తాము చేపట్టిన ఆర్డీఎస్‌‌ రైట్‌‌ కెనాల్‌‌కు తెలంగాణ మద్దతివ్వాలని డిమాండ్‌‌ చేశారు. ఆర్డీఎస్‌‌ రైట్‌‌ కెనాల్‌‌ నుంచి తాము 10 టీఎంసీల తుంగభద్ర నీటిని తీసుకుంటామని, ఈ నేపథ్యంలో బోర్డు రూపొందించిన ఇంప్లిమెంటేషన్‌‌ ఆఫ్‌‌ ఆపరేషనల్‌‌ అండ్‌‌ స్ట్రక్చరల్‌‌ మెజర్స్‌‌లో గల సెక్షన్‌‌ -3ని డిలీట్‌‌ చేయాలని కోరారు.

ఏపీ ఆరోపణలను తిప్పికొట్టలే

శ్రీశైలం ప్రాజెక్టుకు ఈ ఏడాది సమృద్ధిగా వరదొచ్చినా రిజర్వాయర్‌‌లో నీటిమట్టం పడిపోవడానికి తెలంగాణే కారణమని ఏపీ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ ఆరోపించారు. టీఎస్‌‌ జెన్‌‌కో మిస్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కారణంగానే నీళ్లన్నీ కరెంట్‌‌ ఉత్పత్తి పేరుతో వృథా అయ్యాయని విమర్శించారు. కరెంట్‌‌ ఉత్పత్తి చేసే సందర్భంలోనూ ఆర్థిక విజ్ఞత పాటించాలని, దానికి విరుద్ధంగా వ్యవహరించిందని మండిపడ్డారు. యూనిట్‌‌ కరెంట్‌‌ రూ.3కు లభ్యమయ్యే సమయంలో కరెంట్‌‌ ఉత్పత్తి చేసి నీళ్లన్నీ వృథాగా సముద్రంలోకి వదిలేశారని తెలిపారు. ఆ నీటిని ఆదా చేసి ఉంటే యూనిట్‌‌కు రూ.14 ధర ఉన్నప్పుడు ఉత్పత్తి చేసే ఆస్కారం ఉండేదన్నారు. శ్రీశైలంలో కరెంట్‌‌ ఉత్పత్తిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. తెలంగాణపై ఏపీ అధికారులు ఈ స్థాయిలో విరుచుకుపడినా వాటిని తిప్పికొట్టడంలో రాష్ట్ర అధికారులు విఫలమయ్యారు. తెలంగాణతో దాదాపు సమానంగా ఏపీ కరెంట్‌‌ ఉత్పత్తి చేసి, శ్రీశైలం నీళ్లను దిగువకు వదిలేసిందనే నిజాన్ని కనీసం చెప్పలేకపోయారు. పైగా శ్రీశైలం నీళ్ల వినియోగంలో మిస్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ జరిగిందన్న ఏపీ ఆరోపణలను తెలంగాణ స్పెషల్‌‌ సీఎస్‌‌ ధ్రువీకరించారు. కరెంట్‌‌ ఉత్పత్తికి సంబంధించి నిర్దిష్టమైన నిబంధనలు అవసరమన్నారు. తెలంగాణ ఎక్కువగా లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీములపై ఆధారపడుతోంది కాబట్టే శ్రీశైలంలో కరెంట్‌‌ ఉత్పత్తి చేశామన్నారు. రెండు రాష్ట్రాలకు సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే శ్రీశైలంలో కరెంట్‌‌ ఉత్పత్తి చేసి నీటిని నాగార్జున సాగర్‌‌కు వదలాలన్నారు. తెలంగాణలో పవర్‌‌ డిమాండ్‌‌ 12 వేల మెగావాట్ల నుంచి 14,160 మెగావాట్లకు పెరిగిందని, ఈ పరిస్థితుల్లోనే శ్రీశైలంలోని నీటితో కరెంట్‌‌ ఉత్పత్తి చేసి, రివర్స్‌‌ పంపింగ్‌‌లో తిప్పిపోస్తున్నామని టీఎస్‌‌ జెన్‌‌కో డైరెక్టర్‌‌ వివరించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌లో కరెంట్‌‌ ఉత్పత్తికి సంబంధించిన మెకానిజం రూపొందించేందుకు రిజర్వాయర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ కమిటీ (ఆర్‌‌‌‌ఎంసీ) ఏర్పాటుకు అంగీకారం తెలిపారు.

తుమ్మిళ్ల ఎత్తిపోతలు ఆపేస్తం

మీటింగ్‌‌లో తెలంగాణ స్పెషల్‌‌ సీఎస్‌‌ మాట్లాడుతూ.. తుంగభద్ర నుంచి ఆర్డీఎస్‌‌కు ఉన్న 15.9 టీఎంసీల నీటిని ఉపయోగించుకునేందుకే తుమ్మిళ్ల లిఫ్ట్‌‌ స్కీం చేపట్టామని తెలిపారు. తుమ్మిళ్ల నుంచి నీళ్లు ఎత్తిపోయడం భారీ ఖర్చుతో కూడుకున్నదని, ఆర్డీఎస్‌‌ ఆధునీకరణ పూర్తయితే తుమ్మిళ్ల నిలిపి వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏపీ కోరినట్టుగా ఆర్డీఎస్‌‌ రైట్‌‌ కెనాల్‌‌కు సంబంధించి రోడ్ మ్యాప్‌‌లోని సెక్షన్‌‌ -3 తొలగింపునకూ ఓకే చెప్పారు. తెలంగాణ ఈఎన్సీ జోక్యం చేసుకొని ఆర్డీఎస్‌‌ ఆనకట్టను వెంటనే బలోపేతం చేయాలన్నారు. బోర్డు మెంబర్‌‌ స్పందిస్తూ.. రోడ్‌‌ మ్యాప్‌‌ అమలు చేసేందుకు ఆరు నెలల్లోగా పుణెకి చెందిన సెంట్రల్‌‌ వాటర్‌‌ పవర్‌‌ రీసెర్చ్‌‌ స్టేషన్‌‌తో స్టడీ చేయిస్తామని, ఆ వెంటనే పనులు చేపడుతామని హామీ ఇచ్చారు. కృష్ణా నీళ్ల పంపకాలు తేలేవరకు రెండు రాష్ట్రాలకు చెరిసగం నీళ్లు ఇవ్వాలని తెలంగాణ పట్టుబట్టింది. అయితే చైర్మన్‌‌ జోక్యం చేసుకోవడంతో 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ నీళ్లు తీసుకోవడానికి అంగీకారం కుదిరింది.

ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌లపైనా చర్చ

కేఆర్‌‌ఎంబీ హెడ్‌‌ క్వార్టర్స్‌‌ను హైదరాబాద్‌‌ నుంచి వైజాగ్‌‌కు తరలించకపోవడానికి ఏపీ ప్రభుత్వం అక్కడ ఉచితంగా వసతి కల్పించకపోవడమే కారణమని బోర్డు మెంబర్‌‌ వివరించారు. ఒకవేళ వైజాగ్‌‌లో ఫ్రీ అకామిడేషన్‌‌ ఇవ్వలేకపోతే అమరావతిలో ఇచ్చినా బోర్డు హెడ్‌‌ క్వార్టర్స్‌‌ తరలిస్తామన్నారు. ఏపీ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ జోక్యం చేసుకొని కేఆర్‌‌ఎంబీ హెడ్‌‌ క్వార్టర్స్‌‌ ఏర్పాటుకు వైజాగే సరైన ప్రాంతమన్నారు. అక్కడే ఉచితంగా వసతి కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ స్పెషల్‌‌ సీఎస్‌‌ కూడా వైజాగ్‌‌లోనే బోర్డు హెడ్‌‌ క్వార్టర్స్‌‌ ఏర్పాటు చేయాలన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌‌ రిజర్వాయర్ల ఆపరేషన్‌‌ అండ్‌‌ మెయింటనెన్స్‌‌ (రూల్‌‌ కర్వ్స్‌‌)పై సీడబ్ల్యూసీ ఇచ్చిన డ్రాఫ్ట్‌‌ నోటిఫికేషన్‌‌పై 30 రోజుల్లోగా స్టడీ చేసి నిర్ణయం తీసుకోవాలని మీటింగ్‌‌లో నిర్ణయించారు. ఈ బాధ్యతను కొత్తగా ఏర్పాటు చేసే ఆర్‌‌ఎంసీకి కట్టబెట్టారు. వరద రోజుల్లో రెండు రాష్ట్రాలు ఉపయోగించుకునే నీటి వినియోగాన్ని మినహాయించడంతోపాటు, ఏ రాష్ట్రం ఎంతమేరకు నీటిని తీసుకుందనే దానిపైనా స్టడీ చేయాలని ఆర్‌‌ఎంసీకి అప్పగించారు. కృష్ణాపై రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇవ్వాలనే అంశంపై చర్చించారు. రెండు వారాల్లో డీపీఆర్‌‌లు సమర్పిస్తామని తెలంగాణ అధికారులు అంగీకారం తెలిపారు.