వైన్​ షాపులకు రెన్యూవల్​ విధానం పెట్టాలి: తెలంగాణ వైన్​ డీలర్స్ అసోసియేషన్ డిమాండ్

వైన్​ షాపులకు రెన్యూవల్​ విధానం పెట్టాలి: తెలంగాణ వైన్​ డీలర్స్ అసోసియేషన్ డిమాండ్
  • లేదంటే బార్లకు డ్రా సిస్టంఅమలు చేయాలి

ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్రంలో బార్ల లైసెన్స్ రెన్యువల్​పద్దతి ఎలా ఉందో వైన్​షాపులకూ అదే విధంగా అమలు చేయాలని తెలంగాణ వైన్స్​డీలర్స్​అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో అసోసియేషన్​అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు, జనరల్​సెక్రటరీ వి.రామచంద్రారెడ్డి, కోశాధికారి సుభాశ్ కలిసి మాట్లాడారు. ఎక్సైజ్​శాఖలో బార్లకు ఒక రూల్, వైన్​షాపులకు మరో రూల్ ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. బార్లను కూడా లాటరీ పద్దతిలో కేటాయించాలని, లేదంటే వైన్​షాపులకు రెన్యువల్ విధానం అమలు చేయాలన్నారు. 

ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకు వైన్​షాపుల టైమింగ్ ఉంటే, రాత్రి 10 వరకు మాత్రమే తమకు టైమింగ్​ఇవ్వాలని ఇటీవల అధికారులకు బార్ల యాజమాన్యాలు దరఖాస్తు ఇచ్చారన్నారు. అదేవిధంగా పర్మిట్​రూమ్​విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని, పర్మిట్​ రూమ్​వద్ద కిచెన్​ అనేది ఉండదన్నారు. మరోవైపు, బార్లలో 375,180 ,90 ఎంఎల్​బాటిళ్ల​అమ్మడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. 

అయితే, ఆయా బాటిళ్లను​ కొన్నవారు అక్కడే తాగాలని, బయటకు తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు.  అయినప్పటికీ బార్లలో బాటిళ్లు అమ్మడం ద్వారా తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోపించారు.