
హైదరాబాద్: ఫిబ్రవరి 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న కారణంగా తెలంగాణలోని ఏడు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఇవాళ సాయంత్రం (మంగళవారం, ఫిబ్రవరి 25) 4 గంటల నుంచి మద్యం అమ్మకాలు బంద్ అయ్యాయి. వైన్స్, బార్లు మూతబడ్డాయి. మళ్లీ.. గురువారం సాయంత్రం 4 గంటల తర్వాతే ఈ ఏడు జిల్లాల్లో వైన్ షాపులు, బార్లు తెరుచుకునేందుకు అనుమతి ఉంది.
రాష్ట్రంలో మూడు స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం ఇప్పటికే ముగిసింది. మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. నాలుగు వారాల పాటు జోరుగా సాగిన ప్రచారం.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్– ఆదిలాబాద్ – మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది, అదే సెగ్మెంట్ నుంచి గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది పోటీ పడుతుండగా, నల్గొండ– ఖమ్మం–వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి 19 మంది బరిలో నిలిచారు. నెల రోజులుగా ప్రధాన అభ్యర్థులు తీవ్రంగా ప్రచారం నిర్వహించారు.
Also Read:-నా కంఠంలో ప్రాణముండగా కూటమి విడిపోదు..
బీజేపీ మూడు స్థానాలకు పోటీ పడుతున్నది. దీంతో ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నీ తామై ప్రచారాన్ని సాగించారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ కూడా తీవ్రంగానే ప్రచారం చేసింది. చివరికి సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ అధికారికంగా అభ్యర్థులను నిలపలేదు. మరోపక్క పీఆర్టీయూ, యూటీఎఫ్, టీపీటీఎఫ్, సీపీఎస్ఈయూ, జాక్టో, ఎస్జీటీయూ తదితర టీచర్ల సంఘాలూ తమ అభ్యర్థులు బరిలో దింపి జోరుగానే ప్రచారాన్ని సాగించాయి.