తెలంగాణకు గుండు సున్నా.. కేంద్ర బడ్జెట్లో దమ్మిడీ విదిల్చని ఎన్డీఏ సర్కారు

తెలంగాణకు గుండు సున్నా.. కేంద్ర బడ్జెట్లో దమ్మిడీ విదిల్చని ఎన్డీఏ సర్కారు
  • రాష్ట్రంపై కరుణ చూపని కేంద్రం
  • 1.65 లక్షల కోట్లతో ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం
  • బయ్యారం ఊసు లేదు.. ట్రిపుల్ ఆర్ ప్రస్తావన లేదు
  • హైదరాబాద్ ఏఐ సిటీకి నో ఫండ్స్
  • ఫ్యూచర్  సిటీని పట్టించుకోలే.. మెట్రో సెకండ్ ఫేజ్ కు నిధులియ్యలే 
  • దమ్మిడీ విదిల్చని ఎన్డీఏ సర్కారు
  • ఇద్దరు కేంద్ర మంత్రులున్నా వచ్చింది సున్నా

హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ దమ్మిడీ విదిల్చలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్లు వెళ్లి ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రూ. 1.65 లక్షల కోట్ల పనులకు  ప్రతిపాదనలు పంపితే ఒక్క రూపాయి కూడా విదిల్చకపోవడం గమనార్హం. మూడు ఏఐ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

అందులో హైదరాబాద్ పేరు లేకపోవడం నిరాశకు గురి చేసింది. నిర్మలా సీతారామన్ స్పీచ్లో బయ్యారం స్టీల్ ప్లాంట్, హైదరాబాద్– నాగ్ పూర్ కారిడార్, మెగా లెదర్ పార్కు అంశాలను ప్రస్తావించలేదు. మెట్రో రెండో దశ విస్తరణకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని కూడా కేంద్రం అటకెక్కించింది.

ముచ్చర్లలో ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వలేదు. దీంతో పాటు ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉంటున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతోపాటు నిధులు ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదు. ఐటీఐఆర్ ను అటకెక్కించింది.

నదుల అనుసంధానాన్ని కీలకమైన అంశంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం మూసీ–గోదావరి లింకేజీకి నిధుల అంశాన్ని బడ్జెట్ లో ప్రస్తావించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ఒక్క రూపాయి కూడా తేలేక పోయారనే విమర్శలు వస్తున్నాయి.