హైదరాబాద్, వెలుగు: మజాకా మూవీ టీజర్‌లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ అన్షుపై డైరెక్టర్నక్కిన త్రినాథరావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. అతని వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంటున్నట్టు చైర్ పర్సన్ నేరేళ్ల శారద సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలో త్రినాథరావుకు నోటీసులు జారీ చేస్తామన్నారు.
కాగా, డైరెక్టర్త్రినాథరావు వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డైరెక్టర్త్రినాథరావు క్షమాపణ చెబుతూ సోమవారం వీడియో రిలీజ్ చేశారు. ‘‘అందరికీ నమస్కారం.. ముఖ్యంగా మహిళలకు, అన్షు గారికి, నా మాటలు వల్ల బాధపడ్డ ఆడవాళ్లందరికీ నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. నా ఉద్దేశం ఎవరికీ బాధ కలిగించడం కాదు. తెలిసి చేసినా, తెలియకుండా చేసినా తప్పు తప్పే. మీరందరూ పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను’’ అంటూ క్షమాపణ చెప్పారు.
అలాగే, హీరోయిన్ అన్షు స్పందిస్తూ.. ‘‘త్రినాథరావు చేసిన వ్యాఖ్యలపై చర్చ జరిగిందని తెలిసింది. ఆయనెంత మంచి వారో చెప్పేందుకే ఈ వీడియో. ఆయన ఎంతో స్నేహంగా ఉంటారు. నన్ను తన కుటుంబ సభ్యురాలిగా భావించారు. ఆయనపై నాకు గౌరవం ఉంది. టాలీవుడ్‌లో నా సెకండ్ ఇన్నింగ్స్‌కు ఇంత కంటే మంచి దర్శకుడు ఉండరేమో’’ అంటూ సోమవారం వీడియో రిలీజ్ చేశారు.