వలస కార్మికులను ఆసరాగా చేసుకుని కొందరు గల్ఫ్ ఏజెంట్లు మోసాలకు పాల్పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లో పని ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేస్తున్నారు. ఏజెంట్ మోసాలకు సుమారు 70 మంది తెలంగాణ వలస కార్మికులు మస్కట్‌లోని ఒమన్‌లో చిక్కుకుపోయారు. బాధితుల్లో జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల వాసులు ఉన్నారు. విజిట్ వీసా గడువు ముగియడంతో తమను పనిలో నుంచి తీసేశారని.. ఉపాధి లేక ఇంటికి రాలేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ భారతీయ ఎంబసీ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు.
సుమారు నాలుగైదు నెలల నుంచి మస్కట్‌లోని ఒమన్ ఎంబసీ సమీపంలో రోడ్లపై కూర్చుంటూ.. రాత్రి పార్కుల్లో పడుకుంటున్నామని అంటున్నారు. విజిట్ వీసా పై వచ్చి గడువు ముగిసినా.. ఇక్కడే ఉన్నామని 500 ఒమన్ రియాల్స్ జరిమానా విధించారని వెల్లడించారు. అంత డబ్బులు తాము ఎక్కడి నుంచి తేవాలని వాపోతున్నారు. ఏజెంట్ కు ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వడం లేదని.. ఇంట్లో భార్యాపిల్లలు ఆందోళన చెందుతున్నారని బాధితులు చెబుతున్నారు. ఎలాగైనా తమను ఇంటికి రప్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒమన్ దేశంలో క్లీనింగ్ పని ఇప్పిస్తామంటూ వీసా కోసం ఒక్కొక్కరి వద్ద రూ.70 వేల నుంచి లక్ష వరకు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు.