సాహితీలోకం మర్చిపోలేని కవి అలిశెట్టి ప్రభాకర్

అలిశెట్టి ప్రభాకర్ తెలుగు కవిత్వంలో పరిచయం అక్కరలేని కవి. తెలుగు సాహితీలోకం మర్చిపోలేని కవి. కలంతో కవాతు చేసి.. రాశి కన్నా వాసి గొప్పదని నిరూపించిన సాహితీ సూరీడు. ఎంతకాలం బతికామో అన్నది ముఖ్యం కాదు ఎలా బతికాం.. ఎందరి జ్ఞాపకాల్లో నిలిచిపోయామో ముఖ్యమన్నట్లు తన జీవితాన్ని ఉదాహరణగా చేసి చూపించిన అక్షర క్షిపణి. కపాలాలపై కరెన్సీ పేర్చుకునే క్షుద్ర సాహిత్యమో.. వెలుతురు కిరణం సోకని శృంగార నవలల చీకటిగుహెూ కాదిది. అక్షరాల గొయ్యి తవ్వుకోవడం. అరచేతిలో అశోకవనాలు సృష్టించే మాయాజాలం అంతకన్నాకాదు. అక్షరమక్షరం మండుతున్నప్పుడు సమీకరించి, సైన్యంలా రూపొందించిన కృషి ఫలితమే అలిశెట్టి కవిత్వం. రక్తరేఖలతో నిర్మించిన దృశ్యాలే ఆయన కవితా చిత్రాలు.

జగిత్యాలలో 1956 జనవరి 12న చినరాజం, లక్ష్మీ దంపతులకు అలిశెట్టి ప్రభాకర్ పుట్టారు. జయంతి, వర్ధంతి ఒకే రోజు వచ్చే అతి కొద్దిమంది ప్రముఖుల్లో ఒకరుగా ప్రభాకర్​ మిగిలిపోయారు. పదో తరగతి వరకు కరీంనగర్ లో చదివిన ఆయన.. ఇంటర్మీడియెట్ ను సిద్దిపేటలో తన అక్కాబావల వద్ద ఉండి చదువుకున్నారు. ప్రముఖు న్యూస్​ పేపర్లకు ఎన్నో కవితలు రాశారు. 18 ఏండ్ల ప్రాయంలోనే తన కవిత్వాన్ని చిన్న పదాలతోనే గొప్ప అర్థాన్నిచ్చేలా రాశారు. అలతి పదాలతో అనంత అర్థాలు చెప్పి.. అనల్పమైన వాక్యాలతో శబ్దశక్తిని, తన చిత్రాలతో మహా ఇతివృత్త శక్తిని అందించారు. జగిత్యాల జైత్రయాత్ర సమయంలో దోపిడీ చిహ్నాలపై మంటల జెండాలు ఎగురవేసి దశదిశ నిర్దేశిస్తూ పరిష్కారం చూపారు.

అక్షరాన్ని ఆయుధంగా మలిచి..

దోపిడీదారుల పద ఘట్టనల కింద నలిగిపోతున్న మోదుగుపూల వనంలో పద క్షిపణులు పూయించి యోధులకు అందించారు. తన చిత్ర కవితలతో సంచలనం సృష్టించి సమాజాన్ని పట్టి ఇచ్చి ఈ శిథిల ప్రపంచాన్ని పునర్​నిర్మించే ప్రతి విద్యార్థికీ అంకితం ఇచ్చారు. అక్షరాన్ని ఆయుధం చేసి తన కవిత్వాన్ని ప్రాణవాయువుగా మార్చి ప్రపంచంలో నింపాలని తపించాడు. వైవిధ్యభరితమైన తన కవితాక్షరాన్ని వేశ్యా వాటికనే పలక మీద దిద్దుకున్నప్పుడూ అక్షరనేత్రం తెరిచి ఆనాటి ‘దొర’తనాన్ని ఆగ్రహించినప్పుడు ప్రభాకర్ కు పద్దెనిమిదేండ్లు మాత్రమే. సిద్ధాంత గ్రంథాల సారమేది వడబొయ్యకున్నా సిద్దార్థుడు వదిలివెళ్లిన ఈ రాజ్యమ్మీది నెత్తుటి ధారల్ని కడిగేందుకు కవిత్వం ఆయుధమై అప్పటికి పద్నాలుగేండ్లు. ప్రభాకర్ సిటీ లైఫ్​లో నగర జీవితాన్ని, నాణేనికి రెండో వైపులా అందించి దినపత్రికల శైలినే మార్చి వేసిన సందర్భం అది.

కాసుల కోసం వెతుక్కోలేదు

కేన్సర్ తో పోరాడాడు తప్ప కాసుల కోసం వెతుక్కోలేదు. తాను రాసిన కొన్ని కవితలు సినిమాల్లో వాడుకోవడానికి అవకాశం ఉన్నా కానీ సినిమాల కోసం వాటిని రాయడం ప్రభాకర్ కు ఇష్టముండేది కాదు. సినిమా కవిగా మారి ఉంటే ఆర్థిక సమస్యల నుంచి బయట పడవచ్చని తెలిసినా సమాజం కోసమే కవిత్వం రాస్తానని ప్రకటించారు. ఆచరించారు అలిశెట్టి ప్రభాకర్. తొంబై తొమ్మిది మంది చర్మాన్ని ఒలిచి నూరో వాడొక్కడే పరుచుకునే తివాచీ ఈ దేశంలో 'కళాపోషణ' అని భావించి అటువంటి కళలకు దూరంగా ప్రజాసాహిత్యానికి దగ్గరగా నిలిచారు.

సాహితీ చరిత్రపై చెరగని సంతకం

విప్లవోద్యమాల సమయంలో జగిత్యాల గడ్డ మీద పుట్టిన అలిశెట్టి ప్రభాకర్ కవితాకాశంలో ‘ఎర్రపావురాలు’, ‘మంటలజెండా’లు ఎగరేశారు. రక్తరేఖలుగా మళ్లీ మళ్లీ ప్రసరించారు. తన కవితా చిత్ర ప్రదర్శనలతో ఈ సమాజాన్ని అంగుళం మేరకైనా కదిలించగలననే ఆశతో చివరి శ్వాస వరకు బతికారు అలిశెట్టి ప్రభాకర్. ఆయన ఇప్పటివరకు బతికుంటే బాగుండేది. మరణం ఆయన చివరి చరణం కాదు. ఆయన ఇప్పటికీ బతికి ఉంటే తెలంగాణ సాహిత్యంలో అత్యున్నత శిఖరంపై ఉండే వారనటంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. కానీ అలిశెట్టికి రావాల్సినంత గుర్తింపు రాలేదన్నది వాస్తవం. రోజురోజుకూ ఆయన కవిత్వానికి ఆదరణ పెరుగుతోంది. అతి తక్కువ కాలమే బతికినా.. సాహితీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న అలిశెట్టిని గుర్తుచేసుకుంటూ, ఆయన కవిత్వాన్ని స్మరించుకోవడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అవుతుంది.