అమెరికా అబ్బాయితో తెలంగాణ అమ్మాయి పెళ్లి

ఆమెది తెలంగాణ. అతనిది అమెరికా. చదువుకునేందుకు యూఎస్ వెళ్లింది. అక్కడ పరిచయమైన అమెరికన్ యువకుడితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని వారిద్దరు తల్లిదండ్రుల్ని ఒప్పించారు. హిందూ సంప్రదాయ పద్దతిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. భూపాలపల్లి క్లబ్ హౌస్ లో ఈ పెళ్లి జరిగింది. 

క్లాస్ మేట్ తో ప్రేమ.. పెద్దలను ఒప్పించి పెళ్లి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మానస ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడ క్లాస్ మేట్ కానర్ రోగన్ తో ప్రేమలో పడింది. పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎట్టకేలకూ ఇవాళ ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకకు వరుడు రోగన్ తరపున అమెరికాలో ఉంటున్న పేరెంట్స్, బంధు మిత్రులు తరలిరావడంతో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వధువు మానస తల్లిదండ్రులు రామలింగం, ఉషా రాణి దంపతులు కలసి సంప్రదాయ బద్దంగా కన్యాదానం చేశారు. ఇక్కడి అమ్మాయి అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకోవడంపై స్థానికులు కూడా స్పందించారు. పలువురు కళ్యాణ మండపానికి వచ్చి వధూ వరులను ఆశీర్వదించారు. 

వధువు మానస తండ్రి రామలింగం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణిలో ఏజీఎంగా పనిచేస్తున్నారు. వరుడు కానర్ రోగన్ కు భారతదేశం పట్ల.. హిందూ సంప్రదాయాల పట్ల గౌరవం ఉన్నందునే పెళ్లికి అంగీకరించినట్లు చెప్పారు. ఇరువైపులా కుటుంబాలను ఒప్పించి  హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లిలో వివాహం చేసుకోవడం సంతోషంగా ఉందని వధువు మానస, వరుడు రోగన్ చెప్పారు. భారతీయుల సంప్రదాయాలు, పద్ధతులు ఆకట్టుకున్నాయని.. అందుకే  భారతీయ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నామని రోగన్ అన్నారు.