మోడీ తల్లి మరణానికి సంతాపంగా గుండు కొట్టించుకుండు

ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మృతి పట్ల దేశ, విదేశాల నుంచి పలువురు సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి గుండు గీయించుకుని సంతాపం తెలిపాడు. సాధారణంగా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు గుండు చేయించుకోవడం ఆనవాయితీ. అయితే పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల బీజేపీ ఉపాధ్యక్షుడు కర్రె లక్ష్మణ్ నరేంద్ర మోడీపై ఉన్న అభిమానంతో హీరా బెన్ మృతికి వినూత్న రీతిలో సంతాపం తెలిపాడు. మోడీ తల్లి తనకూ తల్లిలాంటిదేనంటూ తలనీలాలు తీయించుకున్నాడు.

ఎంతో మహోన్నతమైన దేశంగా పేరుగాంచిన భారత దేశానికి మోడీ లాంటి వ్యక్తిని ప్రధానిగా అందించిన హీరా బెన్ మృతి తీరని లోటని కర్రె లక్ష్మణ్ అన్నారు. మోడీ తల్లి హీరా బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. హీరా బెన్ ఆరోగ్యం క్షీణించడంతో  కుటుంబ సభ్యులు ఆమెను బుధవారం యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్‌‌లో జాయిన్ చేశారు. చికిత్స కొనసాగుతుండగానే శుక్రవారం తెల్లవారుజామున 3.30కి మృతి చెందారని డాక్టర్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ, కుటుంబ సభ్యుల సమక్షంలో గాంధీనగర్‌‌లో ఉదయం 9.30కి హీరా బెన్ అంత్యక్రియలు ముగిశాయి.