
హైదరాబాద్: హెచ్. సి.ఏ వైఖరి నిరసిస్తూ ఉప్పల్ క్రికెట్ స్టేడియంను యూత్ కాంగ్రెస్ నాయకులు ముట్టడించారు. HCA చైర్మన్ జగన్ మోహన్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అవినీతికి పాల్పడిన జగన్ మోహన్ రావుపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు బినామీలా జగన్ మోహన్ రావు వ్యవహరిస్తూ ఐపీఎల్ టికెట్స్ బ్లాక్ చేస్తున్నాడని యూత్ కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
ఇవి సరిపోక ఇంకా టికెట్స్ కావాలని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఒత్తిడి తెస్తున్నాడని ఆరోపించారు. ఇలా ఒత్తిడి చేసి SRH వేరే రాష్ట్రానికి తరలిపోవాలి అని చూస్తున్నాడని, ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికే జగన్ మోహన్ రావు చేస్తున్నాడని ఆరోపించారు. హెచ్ సి ఏ అధ్యక్షుడు జగన్మోహన రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో యూత్ కాంగ్రెస్ నాయకులను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలు వివాదం ఏంటంటే..
తమిళనాడుకు చెందిన సన్ నెట్ వర్క్ యాజమాన్యంలోని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి హైదరాబాద్‌ను తమ హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకొని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు ఆడుతున్నది. ఐపీఎల్ టైమ్‌లో ఉప్పల్ స్టేడియాన్ని రెంట్‌కు తీసుకుంటున్నది. ఇందుకు ప్రతి మ్యాచ్‌కు హెచ్‌సీఏకు రూ.కోటి చెల్లిస్తున్నది. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల విక్రయాలను సన్ రైజర్స్ ఫ్రాంచైజీనే చూసుకుంటున్నది. స్టేడియం కెపాసిటీ 39 వేలు కాగా.. ఇందులో పది శాతం అంటే 3,900 టికెట్లను కాంప్లిమెంటరీ పాసుల రూపంలో హెచ్‌సీఏకు ఉచితంగా ఇస్తున్నది.
వీటిలో రూ. 750 కనీస ధర టికెట్ల నుంచి రూ. 20 వేలు విలువ చేసే అన్ని సౌకర్యాలతో కూడిన కార్పొరేట్ బాక్స్ పాసులు కూడా ఉంటాయి. కార్పొరేట్ బాక్సు పాసుల కేటాయింపు విషయంలో సన్ రైజర్స్‌కు, హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లకు మధ్య విభేదాలు వచ్చాయి. ఉప్పల్ స్టేడియం సౌత్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్‌లోని ఎఫ్–12-ఏ బాక్సులో గత పదేండ్ల నుంచి హెచ్‌సీఏకు సన్ రైజర్స్ 50 టికెట్లు కేటాయిస్తున్నట్టు చెబుతున్నది. కానీ, ఆ బాక్స్ కెపాసిటీ 30 సీట్లు మాత్రమే అని హెచ్‌సీఏ అంటున్నది. కాబట్టి మిగతా 20 టికెట్లు వేరే బాక్సుల్లో సర్దుబాటు చేయాల్సిందిగా ఈ సీజన్ ముందుగానే రిక్వెస్ట్ చేయగా..సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఒప్పుకున్నది.
అయితే, గత రెండు మ్యాచ్‌లలో ఆ బాక్సుకు 50 టికెట్లు కేటాయించినట్టు చెబుతున్నది. ఈ నెల 27న లక్నో మ్యాచ్ సందర్భంగా ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరింది. ఇతర బాక్సుల్లో 20 టికెట్లు కేటాయించాలంటూ పట్టుబట్టినా వినకపోవడంతో ఎఫ్3 బాక్సుకు హెచ్‌సీఏ తాళం వేసింది. దాన్ని లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకకు కేటాయించడంతో హెచ్‌సీఏ పెద్దలు కావాలనే తమను బ్లాక్‌మెయిల్ చేశారంటూ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ శ్రీనాథ్ ఈ మెయిల్ లో ఫిర్యాదు చేయడంతో వివాదం మరింత ముదిరింది.