ఆత్మకూరు (దామెర) వెలుగు : కష్టేఫలి అని నిరూపించాడు అతడు. ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు హనుమకొండ జిల్లా దామెర మండలం తక్కళ్లపహాడ్ గ్రామానికి చెందిన అరవింద్. హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో పీజీ పూర్తి చేసిన అరవింద్.. ప్రభుత్వ ఉద్యోగ సాధనే ధ్యేయంగా పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో కొత్తగూడెంలోని సింగరేణి సంస్థలో గ్రేడ్ 2 ఆఫీసర్ గా ఎన్నికయ్యాడు.
అలాగే హైదరాబాద్ లోని జీఎస్టీ సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించి ఒకేసారి రెండు ఉద్యోగాలు పొందాడు. అరవింద్ మాట్లాడుతూ.. తాను ఈ స్థాయికి రావడానికి తన తాతయ్య -అమ్మమ్మల ప్రోత్సాహం, అమ్మ శ్రీమాత, అన్న హరీశ్ ల సహకారం మరువలేనిదన్నాడు. అదేవిధంగా త్వరలో వెలువడనున్న న్యూ క్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గ్రూప్ -4 ఫలితాల్లో కూడా తనకు ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బింగి రాజేందర్ అరవింద్ ను అభినందించారు.