తెలంగాణ తొలిపొద్దు..కేశవరావ్​ జాదవ్​ సాబ్​

స్వ రాష్ట్ర ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప తెలంగాణవాది ప్రొఫెసర్​ కేశవరావు జాదవ్. 60 ఏండ్ల ఉద్యమ ఆటుపోట్లలో మడమ తిప్పకుండా పోరాట స్ఫూర్తిని వెలిగించి, కొనసాగించిన మేధావి ఆయన. చెప్పిన సిద్ధాంతాలను ఆచరించిన నైతికవాది. నమ్మిన సిద్ధాంతాన్ని నిర్మొహమాటంగా చెప్పడమే గాక ఎలాంటి వారినైనా ఎదిరించి ఒప్పించడానికి ప్రయత్నించేవారు. 

వృత్తిపరంగా ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుడిగా పనిచేసిన కేశవరావు జాదవ్ తెలంగాణ మహా మేధావులలో అగ్రగణ్యులు. ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్నారు. రామ్ మనోహర్ లోహియా అనుచరుడు.1996లో ప్రారంభమైన మలిదశ ఉద్యమంలో మేధావులకు, ఉద్యమకారులకు దిక్సూచిగా సలహాలు, సూచనలు చేసేవారు. తెలంగాణ ప్రాంతంలోని అనేక జిల్లా కేంద్రాల్లో సభలు, సమావేశాల్లో ప్రసంగించారు. 

ఎస్ఆర్ శంకరన్, కన్నా బిరాన్, ఆనందరావు, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ రామిరెడ్డి తదితర మేధావులకు కేశవరావు జాదవ్ పట్ల అపార గౌరవం ఉండేది. తెలంగాణ కోసం1952 నుంచి 1969 పోరాటం సహా జీవిత కాలమంతా మూడు తరాల ఉద్యోగులను, మేధావులను, విద్యార్థులను కలుపుకొని ఉద్యమానికి పెద్దదిక్కుగా నిలిచారు.

ఉద్యమంలో జైలుకు వెళ్లి..

తెలంగాణ తొలి దశ ఉద్యమంలో ప్రొఫెసర్​ కేశవ్​రావు జాదవ్​ జైలు జీవితం గడిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ను స్థాపించారు. ఉద్యోగ రీత్యా అన్ని అర్హతలు కలిగినప్పటికీ ఉన్నత స్థాయి ప్రమోషన్ కోసం ఎప్పుడూ ఆరాటపడలేదు. యూనివర్సిటీలో పొందగలిగే పదవులను కూడా ఏనాడు ఆశించలేదు. తన జీవితాన్ని వృత్తికి, ఉద్యమాలకే అంకితం చేశారు. ఏ ప్రయోజనాలు ఆశించకుండానే అనేక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నిరాడంబర, నిస్వార్థ, ఆదర్శవంతమైన మేధావి ఆయన. 

జాతీయ నాయకుడు, రైల్వే మాజీ మంత్రి, సోషలిస్ట్ అయిన జార్జ్ ఫెర్నాండస్ తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. సమాజంలో మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించే దిశలో అనేక సభల్లో మాట్లాడేవారు, వాదించేవారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డు తెగల ప్రజల పట్ల వివక్షతను అనేక సందర్భాల్లో ఎదిరించారు. బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ఆరాటపడేవారు. ప్రజా ఉద్యమాల్లో, రాష్ట్ర సాధన పోరాటంలో గాంధేయ విధానాన్ని పాటించాలని యువతకు ఉద్బోధించేవారు. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అనేక అన్యాయాలపై ప్రశ్నిస్తూ, ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన మేధావి కేశవరావు జాదవ్. రాష్ట్రం వచ్చి 9 ఏండ్లు పూర్తయి, పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ప్రభుత్వం సంబరాలు చేస్తున్నది. 

అనేకమంది తెలంగాణ వ్యతిరేకులు, ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించిన వారు, ఉన్నత, మంత్రి పదవులు అలంకరించారు. కానీ తుది శ్వాస వరకు తెలంగాణ కోసం తపించిన కేశవరావు సార్​విగ్రహాన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టే ఆలోచన పాలకులు చేయకపోవడం విచారకరం. స్వరాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులకు, అమరులైన మేధావులకు గుర్తింపు కరువైంది. 

ప్రజాస్వామిక తెలంగాణ ఏది?

ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ప్రొఫెసర్ జయశంకర్ సహా అనేకమంది తొలితరం ఉద్యమకారులు కలలుగన్న సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ కలగానే మిగిలింది. అదీగాక స్వరాష్ట్రం వచ్చి, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. స్వరాష్ట్రంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు127 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా అధినేత కాళ్ల మీద పడి మోకరిల్లుతున్నారు. 

కేశవరావు జాదవ్, జయశంకర్ సార్లు బతికి ఉంటే సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ కోసం ఉద్యమించేవారు, చైతన్యం తెచ్చేవారు. అయినా ప్రొఫెసర్ జాదవ్ స్ఫూర్తితో సాధించిన తెలంగాణను నిరంకుశ, కుటుంబ, ఆధిపత్య నియంత్రణ నుంచి కాపాడుకోవడానికి యువకులు, మేధావులు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వరాష్ట్రం కోసం నిస్వార్థంగా పని చేసిన అమరుల సాక్షిగా.. మరో పోరాటానికి ఉస్మానియా నుంచే ఊపరిలూదాల్సిన సందర్భం వచ్చింది.

ప్రొ ఫెసర్​ కేశవ్​​రావ్​ జాదవ్.. ఈ పేరు1990ల నాటి తెలంగాణ, పౌర హక్కుల, లౌకిక వాదులకు ఎంతో సుపరిచితమైనది. ఆ రోజుల్లో ఈ అంశాలపై ఎక్కడ మీటింగ్​జరిగినా జాదవ్​సార్​కంపల్సరీగా కనిపించే వారు. 1953లోని నాన్​ముల్కీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన.. తర్వాతి కాలంలో పూర్తి తెలంగాణవాదిగా మారారు. ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నపుడు ఆయన విద్యార్థి. నిజాం కాలేజీలో చదివే వారు.1969 నాటి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న ప్రొఫెసర్​జాదవ్​1990ల నాటి మలి దశ ఉద్యమంలో అంతే చురుగ్గా పాలుపంచుకున్నారు. 

నాటి ఉద్యమంలో ఆయన విలక్షణమైన ఆర్గనైజర్​గా మారి ఆర్ఎస్ఎస్​నుంచి ఆర్ఎస్​యూ వరకు అన్ని రకాల భావజాలం ఉన్న వాళ్లను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేసి సఫలీకృతుడయ్యారు. గద్దర్, అద్వానీలను ఢిల్లీలోని జంతర్​మంతర్ లో జరిగిన ఒక మీటింగ్​లో ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్​ఎస్​, లెఫ్ట్​ పార్టీలు, ప్రజా సంఘాలందరినీ ఆయన సమన్వయం చేసేవారు. ఆ పార్టీల లీడర్ల దగ్గరకు వెళ్లి తెలంగాణ ఎందుకు అవసరమో వివరించి చెప్పేవారు. జాదవ్​ సార్​ విశ్లేషణ సామర్థ్యానికి ఎందరో నాయకులు కన్విన్స్​అయ్యి తెలంగాణ వాదులుగా మారడమో, ఉద్యమాన్ని సపోర్ట్​ చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకోవడమో చేశారు. దివంగత ఆలె నరేంద్ర​ తెలంగాణ ప్రజా సమితి పెట్టడానికి జాదవ్ ​సార్​ ఇచ్చిన స్ఫూర్తే కారణం. 

మతవిద్వేషాలపై అధ్యయనం 

పాత నగరంలో మత కల్లోలాలు చెలరేగినపుడు తల్లడిల్లిపోయిన ఎందరో మేధావుల్లో జాదవ్​ సార్​ ఒకరు. ఆయన కేవలం భావోద్వేగాలకే పరిమితం కాకుండా పాత నగరంలోనే ఉండే ఆయన.. ముస్లింలు ఉండే ప్రాంతానికి మారి అక్కడ సామరస్యత ఏర్పడడానికి కృషి చేశారు. సిటీలో మత కల్లోలాల నివారణ కోసం ‘హైదరాబాద్​ ఏక్తా’ అనే సంస్థ ఏర్పాటుకు కృషి చేశారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ‘కమ్యూనల్​ రాయిట్స్​ ఇన్​ హైదరాబాద్: వాట్​పీపుల్​ సే’ అనే నివేదికను రూపొందించారు. మత కల్లోలాలకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే కారణమని, ప్రజల్లో విద్వేషాలు లేవని, వాళ్లు నిత్య జీవన సమరంలో సతమతమవుతున్నారని నివేదికలో తేల్చారు

మనుషుల్ని ప్రేమించడమే నిలువెత్తు లక్షణంగా ఉన్న ప్రొఫెసర్​ జాదవ్​ మహబూబ్​నగర్​కరువుకు చలించి హైదరాబాద్​లోని తన మర్వాడీ శిష్యుల సహకారంతో గంజి కేంద్రాలను నిర్వహించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి అణువణువునా జీర్ణించుకున్న జాదవ్​ సార్​ తాను ప్రసంగించే ప్రతి వేదిక మీద ఒక అమ్మాయి ఉండాలని భావించే వారు. అంతేకాదు ప్రతి కమిటీలోనూ ఒక అమ్మాయి, ఒక దళితుడు, ఒక ఆదివాసీ, ఒక నిరక్షరాస్యుడు ఉండాలని అపుడే పారదర్శకత ఉంటుందనీ, కమిటీలు ప్రజాస్వామికంగా పని చేస్తాయని భావించే వారు. 

తగిన గుర్తింపు రాలేదు..

తెలంగాణ ఉద్యమాన్ని స్వప్నించి, శ్వాసించి దాని సాకారం కోసం నిత్యం పరితపించిన జాదవ్​ సార్​కి తగిన గుర్తింపు రాలేదనే ఆవేదన ఆయనను అభిమానించే వాళ్లలో ఉండిపోయింది. అత్యంత సామాన్య జీవితం గడిపి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో అనామకంగా ఉండిపోవడం అన్యాయమే. ఉద్యమకారులను విస్మరించే ప్రస్తుత పాలనలో జాదవ్​ సార్​అనుమానించినట్లుగానే పాలకులు ఉన్నారు. భౌగోళిక తెలంగాణ తర్వాత ప్రజా తెలంగాణ వైపు పయనించాలని ఆయన గట్టిగా విశ్వసించే వారు. ఆయనే గనుక బతికి ఉంటే కచ్చితంగా ఇపుడు మరో ఉద్యమాన్ని మొదలు పెట్టేవారు. ప్రజా తెలంగాణ కోసం పోరాటం చేసేవారు. అలాంటి వ్యక్తిత్వం, త్యాగనిరతి, నిరాడంబరత, పోరాట శీలత ఉన్న వ్యక్తిని స్మరించుకోవడం మన కనీస బాధ్యత. తెలంగాణ సమాఖ్య

జాదవ్ ​సాబ్​​ వర్ధంతి తీర్మానాలు

జూన్​16  ఉదయం 10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో జాదవ్​ సాబ్​ ఐదో వర్ధంతి సభ ఉన్నది. అందరూ హాజరై మరో ఉద్యమానికి ప్రతిన బూనాలని మా వినతి. ప్రొఫెసర్​ జాదవ్​ వర్థంతి సభ సందర్భంగా తెలంగాణ సమాఖ్య కింది తీర్మానాలను ప్రకటించబోతున్నది. తెలంగాణ ఉద్యమకారుల హంతకుడు కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని తొలగించి, జూబ్లీహిల్స్‌‌లో ఆ స్థానంలో  ప్రొ.కేశవరావు జాదవ్ విగ్రహం ప్రతిష్ఠించాలి. 

కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ పేరుకు ప్రొ. కేశవరావు జాదవ్ పేరు పెట్టాలి.  నిజామాబాద్ డిచ్‌‌పల్లిలో తెలంగాణ విశ్వవిద్యాలయానికి ప్రొ. కేశవరావు జాదవ్ పేరు పెట్టాలి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ వద్ద రోడ్డును ఆనుకొని కట్టిన షెడ్డు స్థానంలో జాదవ్ సార్ ​పేరిట ఆడిటోరియం నిర్మించాలి. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీకి ప్రొ. కేశవరావు జాదవ్ పేరు పెట్టాలి. తెలంగాణ అన్ని విశ్వ విద్యాలయాలలో ప్రొ. కేశవరావు జాదవ్ విగ్రహం విధిగా ప్రతిష్ఠించాలి.

ప్రజల గొంతు జాదవ్​ సాబ్​

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అటు దక్షిణపక్షాలను ఇటు వామపక్షాలను, మధ్యేవాదులైన కాంగ్రెస్ పార్టీని ఒప్పించి తెలంగాణ బిల్లు రూపకల్పనకు మూలస్తంభంగా జాదవ్ నిలిచారు. భౌగోళిక తెలంగాణ వల్ల ప్రజలకు ఒనగూరేదేమీ ఉండదని, క్రమంగా ప్రజాస్వామిక తెలంగాణ వైపు పరిపాలన కొనసాగేటట్లు పాలకవర్గాలపై ఒత్తిడి తేవడానికి నిరంతరం ప్రజలను జాగరూకం చేయాలని ఆయన పరితపించేవారు. జాదవ్ అంటేనే అణగారిన ప్రజల గొంతు నుంచి వెలువడిన నిట్టూర్పు. పేదవాడి చేతి నుంచి లేచిన లాఠీ. 

ప్రజా తెలంగాణతోనే  ప్రొఫెసర్​ జాదవ్ ఆత్మకు శాంతి. ఆయన మరణంతో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రజాతెలంగాణ ఏర్పాటు కర్తవ్యాన్ని కొనసాగించడానికి దీక్ష బూనాల్సిన అవసరం ఉంది.  ప్రొఫెసర్​ జాదవ్ 1933 జనవరి 27న జన్మించారు. 2018 జూన్​16న మరణించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్​ ప్రొఫెసర్​గా రిటైర్​ అయిన జాదవ్..​ జీవితమంతా అణగారిన ప్రజల కోసం పని చేశారు. తెలంగాణ ఉద్యమం ఆయనకు ఊపిరి. నిరంతరం దాని కోసం పరితపిస్తూ ఉండేవారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ప్రొఫెసర్​ జయశంకర్​ను వరంగల్​ నుంచి హైదరాబాద్​కు రప్పించి ఆయనకు షెల్టర్​ ఏర్పాటు చేసింది జాదవ్​ అని చాలా మందికి తెలియదు. జయశంకర్, జాదవ్​ సార్​లు ఇద్దరు తెలంగాణ సాధన ఉద్యమానికి రెండు కళ్ల లాంటివాళ్లు. 

- కూరపాటి వెంకట నారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్