లెంకలపల్లి గ్రామానికి ఎన్నికల ఇంచార్జ్ గా సీఎం కేసీఆర్

హైదరాబాద్: మునుగోడు బై ఎలక్షన్  నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోని లెంకలపల్లి అనే గ్రామానికి పార్టీ ఎన్నికల ఇంచార్జ్ గా సీఎం కేసీఆర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కేవలం 2085 మంది జనాభా ఉండే ఈ గ్రామానికి సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఎన్నికల ఇంచార్జ్ గా రానుండటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు ఎన్నో ఉప ఎన్నికలను ఎదుర్కొంది. ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీశ్ రావునో లేక మరొకరినో నియోజవర్గ ఇంచార్జులుగా పార్టీ నియమించింది. కానీ స్వయంగా  కేసీఆర్ ఇంచార్జ్ గా రావడం... అది కూడా ఓ చిన్న గ్రామానికి కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో మునుగోడు ఎన్నికను అధికార టీఆర్ఎస్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్ధమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇక.. మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి అనే ఈ చిన్న గ్రామం 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా మారింది. అయితే కొన్ని నెలల కిందట స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్ నాయకులు ఈ గ్రామంపై పోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నెల కిందట కాంగ్రెస్ కు చెందిన గ్రామ సర్పంచ్ సతీశ్ 500 మందితో కలిసి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల్లో సతీశ్ మఖ్యమైనవాడు. మనుగోడు ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులకు మునుగోడు ప్రచార బాధ్యతలు అప్పజెప్పింది పార్టీ అధిష్టానం. ఈ క్రమంలోనే మర్రిగూడ మండలానికి మంత్రి హరీశ్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పరిధిలోని ఓ చిన్న గ్రామానికి సీఎం కేసీఆర్ ఎన్నికల ఇంచార్జ్ గా చార్జ్ తీసుకోనున్నారు. ఓ వైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన  కేసీఆర్... ఇప్పుడు ఓ గ్రామానికి ఎన్నికల ఇంచార్జ్ గా రావడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా వచ్చే నెల 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది.