హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 1,050 టీఎంసీల వాటా(ఓవరాల్ షేర్)లో 789 టీఎంసీలను తమకు కేటాయించాలని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్–2 (కేడబ్ల్యూడీటీ–2)కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కృష్ణా ప్రాజెక్టులపై కేడబ్ల్యూడీటీ–2కు ఈ మేరకు స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్ వోసీ)ను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఎస్వోసీకి ఈ నెల 24 వరకే ట్రిబ్యునల్ గడువు విధించగా.. గత నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌వోసీని అందజేసింది. ఏపీ మాత్రం ఎన్నికల సాకు చూపించి ఎస్‌వోసీని ట్రిబ్యునల్‌కు సబ్ మిట్ చేయలేదు. దీంతో ఈ నెల 29వరకు ఏపీకి ట్రిబ్యునల్ డెడ్‌లైన్ పెట్టడంతో తాజాగా ఏపీ కూడా ఎస్వోసీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా జలాల్లో 789 టీఎంసీలు తమవేనని ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదించింది. నిర్మాణం పూర్తయి, వాడుకలో ఉన్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, నిర్మాణంలోని ప్రాజెక్టులకు 238, భవిష్యత్తులో కట్టనున్న ప్రాజెక్టులకు 216, తాగునీటి అవసరాలకు 36 కలిపి మొత్తం 789 టీఎంసీలు కేటాయించాలని కోరింది. కనీస మొత్తంగా 75 శాతం లభ్యత(డిపెండబిలిటీ) ఆధారంగా 555 టీఎంసీలు, 65 శాతం లభ్యత ఆధారంగా 575 టీఎంసీలు కేటాయించాలని విజ్ఞప్తి చేసింది.
బేసిన్ అవతలకు నీళ్లు ఇవ్వొద్దు..
కృష్ణా బేసిన్ అవతలకు జరుపుతున్న కేటాయింపులను నియంత్రించాలని ట్రిబ్యునల్‌ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. 1976 తర్వాత చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బేసిన్ అవతలకు జలాల తరలింపును అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది. కృష్ణా బేసిన్ లో మొత్తం 2,578 టీఎంసీల నీటి కేటాయింపుల తర్వాత వాడుకున్న జలాల్లో మిగిలిపోయిన వాటిని ఏకమొత్తంగా తెలంగాణకే కేటాయించాలని కోరింది. ఇన్ బేసిన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణకు నష్టం చేసేలా ప్రాజెక్టులు కడుతున్న ఏపీని అడ్డుకోవాలని, ఇకపై అలాంటి ప్రాజెక్టులను చేపట్టకుండా వార్నింగ్ ఇవ్వాలని సూచించింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల వాటా(నీటి లభ్యతను బట్టి చేసిన కేటాయింపులు)లో 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా 555 టీఎంసీలు తెలంగాణకు దక్కాలని వాదించింది. కానీ, 2015 నాటి కేటాయింపుల్లో కేవలం 299 టీఎంసీలే కేటాయించారని గుర్తు చేసింది.
పాత కేటాయింపులు మార్చొద్దన్న ఏపీ
రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల్లో కేటాయించిన వాటాలను మార్చవద్దని ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదించింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ఆ కేటాయింపులను మార్చడానికి వీల్లేదని పేర్కొంది. గోదావరి జలాల డైవర్షన్లోని నీటిని కేటాయించేందుకు కృష్ణా ట్రిబ్యునల్‌కు అధికారం లేదని తెలిపింది. 75 శాతం లభ్యత ఆధారంగా ఉమ్మడి ఏపీలో మొదలుపెట్టిన 28 ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో ఆయా ప్రాజెక్టులను ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులుగానే గుర్తించాలని కోరింది. ప్రస్తుతం కడుతున్న, కట్టబోయే ప్రాజెక్టులను మినహాయించి ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకే 75 శాతం లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులను చేయాలని విజ్ఞప్తి చేసింది. కాగా, కేటాయించగా మిగిలిపోయిన జలాల్లో పూర్తి హక్కులు ఏపీకే ఉండేలా చూడాలని డిమాండ్ చేసింది. విద్యుదుత్పత్తి కోసం విడుదల చేసే జలాల కేటాయింపుల కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరింది.