ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూలులో తెలంగాణ టాప్

ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వసూలులో తెలంగాణ టాప్
  • వెల్లడించిన కేంద్ర ఆర్థిక సర్వే

న్యూఢిల్లీ, వెలుగు: 2024-25 అర్థిక సంవత్సరంలో  ఓన్ ట్యాక్స్ రెవెన్యూ(సొంత పన్ను ఆదాయం) ద్వారా అత్యధిక రాబడి సాధించిన రాష్ట్రాల్లో  తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. 15 రాష్ట్రాల్లో 88 శాతంతో తెలంగాణ టాప్ లో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. 

శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే పలు అంశాలను ప్రస్తావించింది. మొత్తం పన్ను వసూళ్లలో 88 శాతం సొంత పన్నులతో  తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా.. కర్నాటక, హర్యానా రాష్ట్రాలు 86 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

2024 ఏప్రిల్–-నవంబర్ మధ్య కాలంలో కేంద్ర గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ(జీటీఆర్), రాష్ట్రాల ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పోల్చదగిన వేగంతో పెరిగినట్లు తెలిపింది. అయితే, కేంద్ర పన్నుల్లో వాటా పెరిగిన కారణంగా.. నవంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం పన్ను ఆదాయ స్థానం మెరుగ్గా కనిపిస్తోందని వెల్లడించింది. 

రాష్ట్ర నిర్దిష్ట పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ సుంకాలు, ఇతర పన్నులు– సుంకాలలో సానుకూల వృద్ధిని నమోదైనట్లు వివరించిం ది. అయితే, రాష్ట్రాల్లో సమిష్టిగా భూమి ఆదాయం తగ్గినట్లు సర్వే రిపోర్ట్ పేర్కొంది.