రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు

రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు
  • ఎస్ఏఎస్సీఐ స్కీం కింద కేంద్రం రుణం 

న్యూఢిల్లీ, వెలుగు: రామప్ప, సోమశిల పర్యాటక సర్క్యూట్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.142 కోట్లు ప్రకటించింది. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్/యూనియన్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్(ఎస్ఏఎస్సీఐ) స్కీం కింద ఈ నిధులు మంజూరు చేసినట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్ఏఎస్సీఐ కింద దేశంలోని పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్టు పేర్కొన్నారు.

ఇందుకోసం 23 రాష్ట్రాలలో 40 ప్రాజెక్టులను గుర్తించినట్టు వెల్లడించారు. రూ.3,295.76 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులకు 50 ఏండ్ల కాలవ్యవధితో వడ్డీరహిత రుణాలు అందించనున్నట్టు తెలిపారు. తద్వారా సుస్థిరమైన పర్యాటకంతో ఉపాధి సృష్టి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సస్టెయినబుల్ టూరిజం సర్క్యూట్(సుస్థిర పర్యాటక సర్క్యూట్స్) కింద రూ.74 కోట్లతో రామప్ప, వెల్ నెస్ అండ్ స్పిరిచ్యువల్ రిట్రీట్ నల్లమల కింద రూ.68 కోట్లతో సోమశిల ప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. తెలంగాణలో రామప్ప, సోమశిల టూరిజం సర్క్యూట్లకు ఆర్థిక సహకారం అందించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ 1, స్వదేశీ 0.2, ఇతర స్కీంల ద్వారా తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.