జాతీయ జెండాను రూపొందించింది తెలుగువాడైన పింగళి వెంకయ్య. ఆ ఘనతలో మన తెలంగాణకు కూడా వాటా ఉంది. ఇంకా చెప్పాలంటే మూడు రంగుల జెండాకు పుట్టిల్లు మన తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నడిగూడెం అని చెప్పొచ్చు. ఇక్కడి సంస్థానంలోనే మన జెండా పురుడు పోసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో పుట్టారు పింగళి వెంకయ్య. పెద్ద చదువులు పూర్తిచేసి, కొన్నేండ్లు బ్రిటిష్ సైన్యంలో కూడా పనిచేశారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ ప్రేరణతో జాతీయోద్యమంలో భాగస్వామి అయ్యారు. అప్పుడే ఆయనకు జాతీయ జెండా గురించిన ఆలోచన వచ్చింది. సొంతంగా జెండా తయారుచేసేందుకు అనేక దేశాల పతాకాలు పరిశీలించారు. మరోవైపు జాతీయోద్యమాల్లో పాల్గొంటూనే1906 నుంచి1922 వరకు మునగాల పరగణాలోని నడిగూడెం సంస్థానంలో సైంటిస్ట్‌గా పనిచేశారు. ఈ సంస్థానం జమీందారు రాజా బహదూర్ నాయిని వెంకట రంగారావు. ఆయన కోరిక మేరకు నడిగూడెంలోనే ఉంటూ, అక్కడ అగ్రికల్చర్సైంటిస్ట్గా పనిచేశారు. పంటలపై పరిశోధనలు చేశారు. ‘కంబోడియా’ రకం పత్తిపై వెంకయ్య చేసిన పరిశోధనను అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా గుర్తించింది. దాంతో పింగళికి ‘పత్తి వెంకయ్య’ అనే పేరు కూడా వచ్చింది.
గాంధీ ఆమోదంతో..
నడిగూడెం సంస్థానంలో పనిచేస్తున్నప్పుడే జెండాకు ఒక రూపం తెచ్చారు వెంకయ్య. దీనికి స్థానిక రామాలయంలో పూజలు చేశారు. 1921 మార్చి 31, - ఏప్రిల్1 తేదీల్లో విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి మహాత్మాగాంధీ వచ్చారు. ఆయన్ని కలిసి, ఖద్దరుతో తాను రూపొందించిన ‘స్వరాజ్’ పతాకం ఇచ్చారు పింగళి. ఈ జెండాలో ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. మధ్యలో స్వరాజ్యానికి గుర్తుగా చరఖా ఉంది. గాంధీజీ సలహాతో తెల్ల రంగును కూడా కలిపి మూడు గంటల్లో కొత్త జెండా తయారుచేసి ఇచ్చారు. దాన్ని చూసి గాంధీజీ ముగ్ధులయ్యారు. ఆ జెండాను జాతీయ జెండాగా కాంగ్రెస్ సమావేశంలో ప్రతిపాదించారు. అలా మొదటి జాతీయ జెండా రూపకల్పనలో మన నడిగూడెం సంస్థానానికి చోటు దక్కింది.
1931 వరకు స్వరాజ్ పతాకం
పింగళి రూపొందించిన స్వరాజ్ జెండా గురించి 1921 ఏప్రిల్13న ‘యంగ్ ఇండియా’ పత్రికలో మహాత్మాగాంధీ ‘మన జాతీయపతాకం’ అనే పేరుతో వ్యాసం రాశారు. అప్పటి నుంచి పింగళి ‘జెండా వెంకయ్య’గా ప్రసిద్ధుడయ్యారు. దాదాపు పదేండ్ల పాటు స్వాతంత్ర్య పోరాటాల్లో స్వరాజ్ పతాకం రెపరెపలాడింది. 1931లో పతాకంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కొన్ని మార్పులు చేసింది. ఎరుపు బదులు కాషాయం వచ్చింది. ఇది పతాకం పైభాగంలో ఉంటుంది. మధ్యలో తెలుపు, ఆ తర్వాత ఆకుపచ్చ పెట్టారు. మధ్యలో తెల్ల రంగుపై చరఖా అలాగే ఉంచారు. 1947లో స్వాతంత్య్రం వచ్చాక బాబూ రాజేంద్రప్రసాద్ సారథ్యంలో జాతీయ పతాక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ చరఖా స్థానంలో అశోక చక్రాన్ని ఆమోదించింది.
నడిగూడెం గడీ చరిత్ర ఇదీ..
నడిగూడెం గడీ ఐదున్నర ఎకరాల్లో ఉంది. దీన్ని డంగు సున్నంతో కట్టారు. గడీలో అప్పట్లోనే ఎంతో విలువైన, విలాసవంతమైన గదులు కట్టారు. మైసూరు నుంచి కూలీలు, బర్మా నుంచి రంగూన్ టేకు తెప్పించారు. కర్రలతో చేసిన మెట్లు ఎంతో కళాత్మకంగా ఉంటాయి. గడీ లోపల చెక్కతో చేసిన దివాన్లు, కిటికీలు, తలుపులు, బీరువాలు అద్భుతంగా ఉంటాయి. గడీ చుట్టూ 40 అడుగుల ఎత్తులో ప్రహరీ ఉంది. లోపల పెద్ద గుర్రపుశాలలు ఉన్నాయి. ఈ గడీ కేంద్రంగా వెంకటరంగారావు సాగించిన పాలనలో పింగళి వెంకయ్య వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తూనే, జెండాను తయారుచేశారు.
::: గంధం సైదులు, మునగాల, వెలుగు