గురుకులాల్లో నాలెడ్జ్ విప్లవం!

పబ్లిక్‌‌ వెల్ఫేర్‌‌ మీద పెట్టే సొమ్మును వట్టి ఖర్చు కింద చూడొద్దు. అది హ్యూమన్‌‌ రిసోర్స్‌‌  డెవలప్‌‌మెంట్‌‌ కోసం పెట్టే కాపిటల్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌. దాని లాభం సొసైటీకి దక్కుతుంది.   కరెక్ట్‌‌ పాలసీలుండి, కచ్చితంగా అమలు చేస్తే వెల్ఫేర్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ నుంచి ఎలాంటి రిజల్ట్స్‌‌ వస్తాయో చెప్పేందుకు బెస్ట్‌‌ ఎగ్జాంపుల్‌‌ తెలంగాణ సోషల్‌‌ వెల్ఫేర్‌‌ రెసిడెన్షియల్​ స్కూల్స్​​​.  సీనియర్‌‌ ఐపీఎస్‌‌ అధికారి డాక్టర్‌‌ ఆర్‌‌ఎస్‌‌ ప్రవీణ్‌‌ కుమార్‌‌ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి ఎనిమిదేళ్లయింది. ఈ సందర్భంగా తన  అనుభవాలను, ఆలోచనలను వెల్ఫేర్‌‌ రెసిడెన్షియల్‌‌ స్కూళ్ల ఎడ్యుకేషన్‌‌, అవి అందిస్తున్న ఫెసిలిటీల్లో మార్పులను గురించి ఆయన వెలుగు ఓపెన్‌‌ పేజీ కోసం పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

వామ్మో.. గురుకులమా! అనే స్థితి నుంచి గురుకులాల్లోనే సీటు కావాలి అనే స్థాయికి పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. పిల్లల చదువు, పెంపకం భారమనే భావంతోనే, రెండు పూటల తిండి, కొద్దిపాటి వసతుల కోసం అప్పట్లో తల్లిదండ్రులు తమ బిడ్డలను గురుకులాల్లో చేర్పించేవారు. కాసింత స్థోమత ఉన్నవాళ్లు వాటివైపు కన్నెత్తి చూసేవాళ్లు కాదు. అలాంటి పరిస్థితి నుంచి గురుకులాలు పూర్తిగా మారిపోయి కార్పొరేట్‌‌ స్కూల్స్‌‌ను  తలపిస్తున్నాయి. సకల హంగులతో కూడిన భవనాలతోపాటు స్టూడెంట్‌‌ ఆల్‌‌రౌండ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ను దృష్టిలో పెట్టుకొని చదువు చెప్తున్నాం.

రెగ్యులర్‌‌ అకడమిక్‌‌ స్టడీస్‌‌కు భిన్నంగా స్పెషల్‌‌ కరికులమ్‌‌ను అమలు చేయడం వల్ల  గురుకులాలు టాప్‌‌లో ఉంటున్నాయి. స్టూడెంట్స్​లో పూర్తి స్థాయి సెల్ఫ్‌‌ కాన్ఫిడెన్స్‌‌ను డెవలప్‌‌ చేసేందుకు చదువులతోపాటు ఫుడ్‌‌, డ్రెస్‌‌లు, వ్యాయామం.. ఇతర సౌకర్యాల విషయంలో గురుకుల సొసైటీ పూర్తి శ్రద్ధ పెడుతోంది. పిల్లలకు భిన్న రంగాల్లో  ఎక్స్‌‌పోజర్‌‌ ఉండేలా అనేక రకాల మోడల్స్‌‌ను అమలు చేస్తోంది. సరుకులు పక్కదారి పట్టకుండా, కరప్షన్‌‌ లేకుండా కిచెన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌కు కంప్యూటర్స్‌‌తో పక్కా విధానాలను తయారు చేసింది.

కోడింగ్‌‌ ఫోర్త్‌‌ లాంగ్వేజ్‌‌

పిల్లల సొంత భాషను ఫస్ట్‌‌ లాంగ్వేజీగా,  హిందీని సెకండ్‌‌ లాంగ్వేజ్‌, ఇంగ్లిష్‌‌ను థర్డ్‌‌ లాంగ్వేజ్​గా టీచ్‌‌ చేస్తుండగా ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో కంప్యూటర్‌‌ ‘కోడింగ్‌‌’ను ఫోర్త్‌‌ లాంగ్వేజ్​గా కంపల్సరీ చేశాం. ప్రతి విద్యార్థి కంప్యూటర్‌‌ కోడింగ్‌‌పై పట్టు సాధించేలా హెచ్‌‌టీఎంఎల్‌‌, సీఎస్‌‌ఎస్‌‌, పైథాన్‌‌, జావా తదితర కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాం. ఇంగ్లిష్‌‌ ప్లస్‌‌ క్లబ్స్‌‌, మిర్రర్‌‌ ప్రాజెక్టుల ద్వారా వారికి ఇంగ్లిష్‌‌పై గట్టి పట్టు సాధించేందుకు సాయపడుతున్నాం. టీచర్లూ భాషపై పట్టు సాధించేందుకు టీచర్స్‌‌ ప్లస్‌‌ క్లబ్‌‌లు సైతం ఏర్పాటు చేశాం.

బాలికలు.. మెరికలు…

సోషల్‌‌ వెల్ఫేర్‌‌లో 30 మహిళా డిగ్రీ కాలేజీలు, ట్రైబల్‌‌ వెల్ఫేర్‌‌లో 22 మహిళా డిగ్రీ కాలేజీలు మంచి రిజల్ట్స్​  సాధిస్తున్నాయి. సాధారణ డిగ్రీ కాలేజీల్లో సగటున 25 నుంచి 30 శాతం పాస్​ పెర్సంటేజి ఉంటే గురుకుల డిగ్రీ కాలేజీల్లో 65 నుంచి 85 శాతం పాస్‌‌ పెర్సంటేజి ఉంది. బాలికల గురుకులాల్లో జిమ్‌‌ ఏర్పాటు చేశాం. మహిళా డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులకు కారు డ్రైవింగ్‌‌ నేర్పిస్తున్నాం. గురుకుల డిగ్రీ కాలేజీల స్టూడెంట్స్​ శ్రీలంక, నేపాల్‌‌, వియత్నాం, కంబోడియా, పోలాండ్‌‌, గ్రీస్‌‌ దేశాల్లో ఇంటర్నేషనల్‌‌ స్టూడెంట్‌‌ ఎక్స్ఛేంజీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఎస్సీ గురుకులాల నుంచి 27 మంది విద్యార్థులు ఈ పథకం కింద వివిధ దేశాల్లో పర్యటించారు.

టాప్‌‌ ఇన్​స్టిట్యూట్స్‌‌లో….

ఐఐటీ, ఎన్‌‌ఐటీ, ఢిల్లీ వర్సిటీ, అజీం ప్రేమ్‌‌జీ వర్సిటీ, టాటా ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ సోషల్‌‌ సైన్సెస్‌‌, ఇంజనీరింగ్‌‌, మెడికల్‌‌, బీడీఎస్‌‌, లా వంటి కోర్సుల్లో మంచి ర్యాంకులతో స్టూడెంట్స్‌‌ సీట్లు సాధిస్తున్నారు. వాళ్లను ప్రోత్సహించేందుకు ల్యాప్‌‌ టాప్‌‌లు, రూ.50 వేల నగదు అందిస్తున్నాం. మెరిట్‌‌ స్టూడెంట్స్‌‌ను ఎస్‌‌ఆర్‌‌ శంకరన్‌‌ సూపర్‌‌ స్టూడెంట్స్‌‌ పేరుతో గుర్తించి వాళ్లతో మన టీవీలో పాఠాలు చెప్పిస్తూ రెమ్యునరేషన్‌‌ కూడా ఇస్తున్నాం. వాళ్లను గ్రీన్‌‌ గురూస్‌‌ పేరుతో టీచర్ల కొరత ఉండే స్కూళ్లకు పంపి అక్కడ కూడా క్లాసులు చెప్పిస్తున్నాం. ఇవన్నీ పేమెంట్‌‌ సర్వీసులే.

దేశ, విదేశాల్లో..

చదువు, క్రీడలు, ఇతర రంగాల్లో ప్రతిభ చూపించేవాళ్లను గుర్తించి ఏడాదికి 500 మందిని దేశంలోని వివిధ ప్రాంతాల టూర్​కి పంపిస్తున్నాం. ట్రైబల్‌‌ స్కూళ్ల నుంచి ఏటా 300 మంది విద్యార్థులను భారత్‌‌ దర్శన్‌‌కు పంపిస్తున్నాం. కమ్యూనిటీ కాలేజీ ఇనీషియేటివ్‌‌ ప్రోగ్రాం (సీసీఐపీ) ఫెలోషిప్‌‌ను గురుకుల విద్యార్థులు జి.ప్రియాంక, ఎం. ఆనంద్‌‌ అందుకున్నారు. ప్రియాంక లండన్‌‌ వర్సిటీ పరిధిలోని బంకర్‌‌ హిల్‌‌ కమ్యూనిటీ కాలేజీలో చదువుతుండగా, ఆనంద్‌‌ అమెరికాలోని అరిజోనా మెసా కమ్యూనిటీ కాలేజీలో అడ్మిషన్‌‌ సాధించాడు. మొత్తంగా ఆరుగురు విద్యార్థులు సీసీఐపీ ఫెలోషిప్‌‌ను, నలుగురు కెన్నడీ లుగార్‌‌ ఫెలోషిప్‌‌ (యూఎస్‌‌ఏ) సాధించారు. జగిత్యాలకు చెందిన మాధురి లండన్‌‌ వర్సిటీలో ఎంఏ (ఎకనామిక్స్‌‌) చదువుతున్నారు. 2012 జూలై 4న గురుకుల సొసైటీ సెక్రటరీగా నేను బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నిరుపేద విద్యార్థులకు మంచి ఫ్యూచర్‌‌ ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నా. ఇందులో తెలంగాణ ప్రభుత్వం సహకారం కూడా ఉంది. ప్రభుత్వ స్కూళ్లకు, గురుకులాలకు మధ్య ఎక్కడో గ్యాప్‌‌ ఉంది. దాన్ని పూడ్చడానికి కొన్ని ప్లాన్స్‌‌ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాం. గురుకులాల్లో వచ్చిన నాలెడ్జ్‌‌ విప్లవం పల్లెలకు, బస్తీలకు చేరాలి. ప్రతి ఇల్లు ఒక స్కూల్‌‌ కావాలి. గురుకులాలు ఒక ఇరుసులా ఉండి ఇక్కడ ఏం జరుగుతోందో ప్రతి ఇంట్లో అది జరిగేలా చూడాలి.

ఫైన్‌‌ ఆర్ట్స్‌‌.. మార్షల్‌‌ ఆర్ట్స్‌‌…

ఫైన్‌‌ ఆర్ట్స్‌‌ విషయంలో కూడా ఎస్‌‌సి, ఎస్టీ పిల్లలు రాణించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా రెండు ఫైన్‌‌ ఆర్ట్స్‌‌ స్కూల్స్‌‌ను ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నాం. 22 స్పోర్ట్స్‌‌ అకాడమీలు పెట్టి విద్యార్థులను మంచి ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతున్నాం. చెస్‌‌, కరాటే, జూడో, రెజ్లింగ్‌‌, కబడ్డీ, ఫుట్‌‌బాల్‌‌, హాకీ, అథ్లెటిక్స్‌‌, రగ్బీ, సెయిలింగ్‌‌, వాలీబాల్‌‌, హ్యాండ్‌‌బాల్‌‌, గోల్ఫ్‌‌, క్రికెట్‌‌ లాంటి ఆటల్లో శిక్షణ ఇప్పిస్తు న్నాం. చాలామంది పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్‌‌ సాధించారు. ధనికుల క్రీడగా పేరున్న గోల్ఫ్‌‌లో శిక్షణ కోసం గురుకులాల్లో మినీ గోల్ఫ్‌‌ కోర్సులు ఏర్పాటు చేసి, మెరుగైన కోచింగ్​ కోసం పెద్ద కోర్సులకు పంపిస్తున్నాం. రుక్మాపూర్‌‌, అశోక్‌‌నగర్‌‌లో సైనిక్‌‌ స్కూల్స్‌‌, భువనగిరిలో ఆర్మ్‌‌డ్‌‌ ఫోర్సెస్‌‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీ ఫర్‌‌ ఉమెన్‌‌ ఏర్పాటు చేశాం. పారా మిలటరీ విభాగాల్లో గురుకుల స్టూడెంట్స్‌‌ ఆఫీసర్‌‌ క్యాడర్‌‌ అవకాశాలు అందిపుచ్చుకునేలా ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం. మలావత్‌‌ పూర్ణ, ఆనంద్‌‌ల వారసత్వాన్ని పదుల సంఖ్యలో పిల్లలు అందిపుచ్చుకొని పర్వతారోహణలో శిక్షణ పొందుతున్నారు.