తిరుమల లడ్డూ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన విజయ డైరీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ తయారీకీ తాము స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేస్తామని టీటీడీకి ప్రతిపాదన పంపింది.
TTD కి సమర్పించే నైవేద్యాల కోసం స్వచ్ఛమైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలంగాణ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ తెలిపారు. ఈ మేరకు ఆయన TTD కార్యనిర్వహణ అధికారి జె.శ్యామలరావుకు సెప్టెంబర్ 21న లేఖ రాశారు.
దేశ వ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తుల రంగంలో తెంలగాణ విజయ డైరీ సంస్థ ప్రసిద్ధి చెందినదని, వినియోగదారులకు విలువైన, నాణ్యమైన ఉత్పత్తులను సరఫరా చేసిన చరిత్రను కలిగి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. విజయ డైరీ ఉత్పత్తులలో నాణ్యతను నిర్ధారించడంతో పాటు, లక్షలాది మంది పాల రైతుల జీవనోపాధికి సంస్థ తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక నాణ్యత గల నెయ్యి, ఇతర పాల ఉత్పత్తుల అవసరాలన్నింటినీ తీర్చడానికి విజయ డైరీ సంస్థ సన్నద్దతను తెలియజేశారు. విజయ డైరీ ప్రభుత్వ సంస్థ అయినందున సరఫరాల స్వచ్ఛత, నాణ్యత, ధరల విషయంలో పూర్తి పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.
దేవస్థానానికి, భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని ఘోష్ లేఖలో విజ్ఞప్తి చేశారు.
ALSO READ : ఎలాంటి విచారణకైనా సిద్ధం: ఏఆర్ డెయిరీ
తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ప్రొడక్ట్స్ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తుంది. అయితే లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు రాజకీయంగా అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే.. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కూడా కోరింది కేంద్ర ప్రభుత్వం. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై మరో వైపు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.