రాజన్న ఆలయంలో తలనీలాలు సీజ్

రాజన్న ఆలయంలో తలనీలాలు సీజ్

వేములవాడ, వెలుగు:  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో భక్తులు స్వామివారికి సమర్పించే తలనీలాలకు కాంట్రాక్టర్​డబ్బులు చెల్లించకపోవడంతో గురువారం అధికారులు సీజ్ చేశారు. ఆలయంలోని కల్యాణకట్ట1, కల్యాణ కట్ట2లో భక్తులు  సమర్పించే తలనీలాల కాంట్రాక్ట్‎ను రూ. 19 కోట్లకు ఏపీలోని హిందుపురానికి చెందిన సుమితి ఎంటర్​ప్రైజెస్​దక్కించుకుంది. సదరు కాంట్రాక్టర్ ప్రతి నెలా రూ. 79 లక్షలు ఆలయానికి చెల్లించాల్సి ఉంది.  గత ఏప్రిల్ వరకు కిస్తీలు చెల్లించిన కాంట్రాక్టర్​మే నెల నుంచి ఇవ్వడంలేదు.  

రూ. 10 కోట్లు కట్టాల్సి ఉంది.  టెండర్​అగ్రిమెంట్ ప్రకారం.. వచ్చే ఏడాది ఏప్రిల్​వరకు గడువు ఉన్నా కాంట్రాక్టర్ మధ్యలోనే​ చేతులెత్తేశాడు. దీంతో మూడు సార్లు నోటీసులు, ఒకసారి లీగల్​నోటీస్ ఆలయ అధికారులు జారీ చేసినా అతను నుంచి రెస్పాన్స్​రాలేదు.  దీంతో సుమారు రూ.1 కోటి 50 లక్షల విలువైన తలనీలాలు డ్యామేజ్​అయ్యే చాన్స్ ఉండగా​ఆరబెట్టి గన్నీ సంచుల్లో నింపి రూమ్ లో భద్రపరిచిన అనంతరం సీజ్ చేశారు. కాంట్రాక్టర్​బకాయిలను చెల్లిస్తే తిరిగి ఇస్తామని, దీనిపై ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ ​దృష్టికి తీసుకెళ్లామని ఆలయ ఏఈఓ శ్రావణ్​ తెలిపారు. .