న్యూఢిల్లీ: పోస్ట్‌పెయిడ్ సెగ్మెంట్లో పోటీ తీవ్రం కావడానికి తోడు, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టెలికం కంపెనీలు ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో టారిఫ్‌లను పెంచే అవకాశాలు లేవని ఎనలిస్టులు అంటున్నారు. 2024–25 ఫైనాన్షియల్ ఇయర్లోనే టారిఫ్‌లు పెరిగే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. పోటీ పెరగడంతో ఏవరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఆర్పు) గ్రోత్ నెమ్మదించొచ్చని కూడా ఈ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
టారిఫ్‌లు 2025 ఫైనాన్షియల్ఇయర్లో పెరగొచ్చని ఎంకే ఇండియా ఈక్విటీస్ రీసెర్చ్ ఎనలిస్టులు చెప్పారు. 5 జీ నెట్వర్కుల కోసం పెట్టిన పెట్టుబడుల రికవరీ కోసం తగినంతగా టెలికం కంపెనీలు ప్రతిఫలాలను పొందలేకపోతున్నాయని వారు పేర్కొన్నారు. టారిఫ్‌లు కొద్దిగా పెరిగినా భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లకు బెనిఫిట్ కలుగుతుందని, కానీ కష్టాలలో కొనసాగుతున్న వోడాఫోన్ ఐడియాకు మాత్రం పెద్దగా ఒరిగేదేమీ ఉండదని వారు వివరిస్తున్నారు.
2024, 2025 ఫైనాన్షియల్ ఇయర్లకు ఆర్పు అంచనాలను సవరించినట్లు పేర్కొన్నారు. ఆర్పు ఈ రెండేళ్లలో వరసగా 6 శాతం, 2 శాతం చొప్పున తగ్గుతుందని చెప్పారు. టారిఫ్‌ల పెంపు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రెవెన్యూ అంచనాలను సైతం సవరించామని వెల్లడించారు. 2024 లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నందువల్ల టెలికం టారిఫ్‌లు పెరిగే సూచనలు కనబడటం లేదని కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఒక నోట్లో వెల్లడించింది.
టారిఫ్‌లు పెరగాల్సి ఉందని, కానీ ఎన్నికలయ్యేదాకా ఆ అవకాశం కనబడటం లేదని పేర్కొంది. 2025 ఫైనాన్షియల్ ఇయర్లోనే 4జీ ప్రీ పెయిడ్ టారిఫ్‌లు పెరగొచ్చని వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశమంతటికీ 5జీ సర్వీసులు తేవడంపైన రిలయన్స్ జియో ఫోకస్ పెడుతోందని వివరించింది.