సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. గ్రాడ్యుయేట్, టీచర్ల ఫోన్లను హోరెత్తిస్తున్న టెలీకాలర్లు

సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. గ్రాడ్యుయేట్, టీచర్ల ఫోన్లను హోరెత్తిస్తున్న టెలీకాలర్లు
  • సర్వేల పేరిట ఓటర్ల నాడీ తెలుసుకునే ప్రయత్నం 
  • జనరల్ ఎలక్షన్ తరహాలో ప్రచార పర్వం

నిర్మల్, వెలుగు:  గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీ చేస్తున్న అభ్యర్థులంతా సోషల్ మీడియాలో తమను గెలిపించాలని కోరుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గ టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇప్పటికే నాలుగు ఉమ్మ డి జిల్లాల్లో పర్యటించి తమ సన్నిహితులు, అనుచరులు, ఆయా సంఘాల సభ్యులను కలిసి మొదటి రౌండ్  ప్రచారాన్ని పూర్తి చేశారు.  ఈ ఎన్నికల్లో బీజేపీ గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీలకు తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.  

కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిని ప్రకటించి టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం విషయంలో ఇప్పటివరకు స్పష్టత నివ్వలేదు. తెలంగాణ పీఆర్టీయూ, పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థులిద్దరిలో ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వడమో లేదంటే తటస్థంగా ఉండడమో అనే అంశంపైనే  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటున్నారు. మొన్నటివరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉంటుండడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ముందుగానే సోషల్ మీడియా ద్వారా తమ ప్రచారాన్ని ప్రారంభించారు.

ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్‌‌‌‌లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు సోషల్ మీడియా ద్వారా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు.  రాజకీయ పార్టీలకు చెందిన గ్రూపులు, టీచర్ సంఘాల గ్రూపులు, వివిధ ఉద్యోగ , కుల, యువజన సంఘాల గ్రూపుల్లో  తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తమను  గెలిపిస్తే అటు గ్రాడ్యుయేట్లకు ఇటు టీచర్లకు చేసే సేవలను వివరిస్తున్నారు.  

టెలీకాలర్లతో ప్రచారం.. 

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీల అభ్యర్థులు వాయిస్  మెసేజెస్ తో ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు.  పలువురు అభ్యర్థులు టెలీకాలర్లను నియమించుకున్నారు. వారి ద్వారా ప్రతి రోజు వందలాదిమంది  సెల్ ఫోన్ వినియోగదారులకు ఫోన్లు చేయిస్తూ ఫలానా అభ్యర్థి ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని తమ అభ్యర్థిని తప్పనిసరిగా గెలిపించాలని కోరుతూ ఊదరగొడుతున్నారు.  టెలీకాలర్ల గోల తట్టుకోలేక చాలామంది తమ ఫోన్ లను ఆఫ్ చేస్తున్నారు.

సర్వేల పేరిట 

కొంత మంది అభ్యర్థులు పరోక్షంగా సర్వేల పేరిట తమ బలబలాలను బేరీజు వేసుకుంటున్నారు.  కొంత మంది టెలీకాలర్లు ఓటర్లకు ఫోన్ చేస్తూ తాము  ఓ సర్వే సంస్థకు చెందిన ప్రతినిధులమని చెబుతూ పరిచయం చేసుకుంటున్నారు. ఆ తర్వాత మీరు రాబోయే ఎమ్మెల్సీ ఎవరికి ఓటు వేయబోతున్నారని లేదంటే ఎవరికీ  మద్దతు ఇచ్చే అవకాశం ఉందంటూ ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా తాము ఫలానా అభ్యర్థికి ఓటు వేస్తామని చెప్పగానే దానికి కారణాలు అడుగుతున్నారు.  ఈ సంస్థల పేరిట కొంతమంది అభ్యర్థులు తమతోపాటు తమ ప్రత్యర్థుల  బలబలాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.