ఇబ్బందుల్లో టెల్కోలు పెట్టిన పైసలు రాలే..

ఇబ్బందుల్లో టెల్కోలు పెట్టిన పైసలు రాలే..

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు 2024 సంవత్సరం పెద్దగా కలసి రాలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి 5జీ సేవలతోపాటు విస్తరణ కోసం ఈ ఏడాది రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టాయి. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు టారిఫ్​లు పెంచాయి. ఈ నిర్ణయం ఎదురుతన్నింది. దాదాపు రెండు కోట్ల మంది తమ కనెక్షన్లను రద్దు చేసుకున్నారు. చార్జీలను 10–26 శాతం పెంచడంతో రిలయన్స్​జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్​ఐడియాకు 2.6 కోట్ల మంది కస్టమర్లు దూరమయ్యారు. 

​ధరలు పెంచకపోవడంతో చాలా మంది బీఎస్​ఎన్​ఎల్ కనెక్షన్లు తీసుకున్నారు. అయితే ఈ కంపెనీ ఇప్పటికీ 3జీ సేవలనే అందిస్తోంది. పూర్తిస్థాయిలో 4జీ సేవలను మొదలుపెట్టలేదు. పెట్టుబడులను రాబట్టుకోవడానికి జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్​ ఐడియా మరింత డబ్బు ఖర్చు చేస్తున్నాయి. 5జీని విస్తరించడంతోపాటు కొత్త తరం సేవలు అందించడానికి నిధులు గుమ్మరిస్తున్నాయి. 

5జీ ఎకోసిస్టమ్​ను బలోపేతం చేయడానికి టెల్కోలు 2022–2027 మధ్య రూ.92,100 కోట్ల నుంచి రూ.1.41 లక్షల కోట్ల వరకు ఇన్వెస్ట్​చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే టెల్కోలకు శాటిలైట్​బ్రాడ్​బ్యాండ్​రూపంలో కొత్త సమస్య ఎదురవుతుందని భావిస్తున్నారు. ఎలాన్​మస్క్​కంపెనీ స్టార్​లింక్​ కోరినట్లుగా కేంద్రం అడ్మినిస్ట్రేటివ్​ విధానంలోనే శాటిలైట్ ​బ్రాడ్​బ్యాండ్​స్పెక్ట్రమ్​ను కేటాయిస్తామని ప్రకటించింది. ఈ విధానాన్ని జియో తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇలా చేస్తే స్టార్​లింక్​ వంటి కంపెనీలకు తక్కువ ధరకు స్పెక్ట్రమ్​వస్తుందని, చౌకగా డేటా ఇస్తాయని టెల్కోలు ఆందోళన చెందుతున్నాయి. జియో కూడా శాటిలెట్​ బ్రాడ్​బ్యాండ్​ సేవలను అందించడంపై ఆసక్తిగా ఉంది.