అందమైన యువతులు, మహిళలే టార్గెట్.. టెలిగ్రామ్ అడ్డాగా డీప్‌ఫేక్ వీడియోల వ్యాపారం

 అందమైన యువతులు, మహిళలే టార్గెట్.. టెలిగ్రామ్ అడ్డాగా డీప్‌ఫేక్ వీడియోల వ్యాపారం

అశ్లీలత, పైరేటెడ్ కంటెంట్, ద్వేషపూరిత ప్రసంగాలు, తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన టెలిగ్రామ్‌ను వివాదాలు చుట్టూ ముడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ యాప్ వినియోగాన్ని పలు దేశాలు పరిమితం చేయగా.. భారత ప్రభుత్వం సైతం ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ సోషల్ మీడియా యాప్ భారత ఐటీ నిబంధనలను పాటిస్తోందా..! లేదా అనే దానిపై విచారణ జరుపుతోంది. 

డీప్‌ఫేక్ అశ్లీల వీడియోలు 

ఇదిలావుంటే టెలిగ్రామ్‌ అడ్డాగా దక్షిణ కొరియా మహిళల లైంగిక అసభ్యకరమైన డీప్‌ఫేక్ చిత్రాలు, వీడియోల వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తేలింది. నేరగాళ్లు డీప్‌ఫేక్ టెక్నాలజీ సాయంతో అశ్లీల వీడియోలకు దక్షిణ కొరియా మహిళల మొహాలు చేర్చి వాటిని టెలిగ్రామ్‌ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేస్తున్నారనేది వస్తున్న వార్తల సారాంశం. ఇలాంటి వీడియోల్లో ఎక్కువుగా స్కూల్స్, కాలేజీల విద్యార్థులే బాధితులుగా ఉన్నట్లు తేలింది. ఐదు రోజుల్లో ఇలాంటి వీడియోల గురించి పోలీసులకు 118 ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై దక్షిణ కొరియా అసెంబ్లీలో చర్చ జరగడంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రకటన నేపథ్యంలో టెలిగ్రామ్‌ యాజమాన్యం.. దక్షిణ కొరియా ప్రజలకు, అధికారులకు క్షమాపణలు చెప్పింది.

25 వీడియోలు తొలగించాం.. 

దక్షిణ కొరియా కమ్యూనికేషన్స్ స్టాండర్డ్స్ కమిషన్(KCS) అభ్యర్థనను అనుసరించి 25 వీడియోలను తీసివేసినట్లు టెలిగ్రామ్‌ ప్రకటించింది.