- నిజాలు చెప్పేందుకే మహారాష్ట్రకు వచ్చిన: సీఎం రేవంత్ రెడ్డి
- 25 రోజుల్లోనే రూ.17,869 కోట్లరైతు రుణాలు మాఫీ
- అనుమానాలుంటేఆధారాలతో చెప్పేందుకు రెడీ
- పది నెలల్లో 50 వేలఉద్యోగాలు భర్తీ చేసినం
- మేం గ్యారంటీలు అమలుచేస్తుంటే బీజేపీ తప్పుడు ప్రచారం
- మహారాష్ట్ర రైతులనుకేంద్రం ముంచింది
- అదానీ, అంబానీ మేలు కోసం నల్ల చట్టాలు తేవాలనుకున్నరు
- అదానీకి మోదీ పైసలిస్తుంటే.. తాము అదానీ జేబులోంచి గుంజుతున్నమని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని ఆరు గ్యారంటీల అమలుపై ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలు చెప్తున్నారని, రుణమాఫీపై తాను నిజాలు చెప్పగానే ఆయన ట్వీట్‌ను తొలగించుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. ‘‘కేవలం 25 రోజుల్లోనే 22 లక్షల 22 వేల 67 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశాం. ఇందుకు సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలున్నా ఆధారాలతో వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న” అని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ శనివారం ముంబైకి చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణలో అమలవుతున్న ఆరు గ్యారంటీలపై నిజాలు చెప్పేందుకే నేను ఇక్కడికి వచ్చాను. మోదీ అబద్ధాలు చెప్పడం మాననంతకాలం మేం నిజాలు చెప్తూనే ఉంటాం’’ అని పేర్కొన్నారు.
మహారాష్ట్రపై గుజరాత్ నేతల పెత్తనం
దేశంలో మహారాష్ట్రలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని మండిపడ్డారు. ‘‘మోదీ నల్ల చట్టాలు అమల్లోకి తెచ్చి అదానీ, అంబానీకి మేలు చేయాలని చూశారు. మహారాష్ట్రపై గుజరాత్ నేతలు పెత్తనం చేస్తున్నరు. అందుకే మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా ప్రాజెక్టులను గుజరాత్ కు తరిలించుకొని పోయారు. ఇక్కడి వారిని మోసం చేసిన బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలి” అని మహారాష్ట్ర ప్రజలకు ఆయన సూచించారు.అదానీకి ప్రతిచోటా మోదీ పైసలు ఇస్తుంటే తాము అదానీ జేబులోంచి గుంజుతున్నామని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ సమాధానమిచ్చారు. దేశచరిత్రలో మహారాష్ట్రకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన తెలిపారు.
‘‘దేశ గతిని మార్చిన ఎందరో మహానుభావులకు మహారాష్ట్ర గడ్డ జన్మనిచ్చింది. ఈ రాష్ట్రానికి చెందిన మహాత్మా జ్యోతిబాపూలే, బాలగంగాధర్ తిలక్, సావిత్రి భాయి పూలే, అంబేద్కర్ వంటి ఎందరో మహానుభావులు ప్రజల్లో చైతన్యం నింపి దేశానికి ఒక దారి చూపారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న మహారాష్ట్ర ఇప్పుడు ఏక్నాథ్షిండేల చేతుల్లో ఉండడం బాధాకరం” అని అన్నారు. బీజేపీ నేతలు కొద్దిరోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. అందుకే తాను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో విజయవంతంగా అమలు అవుతున్న ఆరు గ్యారంటీలపై నిజాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చానని ఆయన వివరించారు.
కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కేవలం 10 నెలల వ్యవధిలోనే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మహాలక్ష్మి పథకం కింద రూ. 500కే గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల ఇండ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. వరికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నదని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో కుల గణనను చేపట్టామని తెలిపారు. 2025లో దేశ వ్యాప్తంగా చేపట్టనున్న జనగణనలో తెలంగాణ కుల గణనను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర కేబినెట్ లో తీర్మానం చేసి మోదీని డిమాండ్ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కాగా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ముంబైలో రోడ్ షో నిర్వహించారు.
నేడు కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు సీఎం
చిన్నచింతకుంట, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి క్షేత్రానికి రానున్నారు. ఇటీవల దేవరకద్ర, మక్తల్ ఎమ్మెల్యేలు జి.మధుసూదన్, వాకిటి శ్రీహరి.. సీఎంను కలిసి కురుమూర్తి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానపత్రికను అందజేశారు. ఉద్దాల ఉత్సవానికి సీఎం రావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల కార్యక్రమం రద్దయింది. అయితే, ఆదివారం సీఎం టూర్ ఫిక్స్ అయింది. రోడ్డు మార్గాన ఆయన హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం 10 గంటలకు బయల్దేరి 12 వరకు కురుమూర్తికి చేరుకోనున్నారు. ముందుగా రూ.110 కోట్లతో నిర్మించనున్న కురుమూర్తి ఘాట్ రోడ్డుకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం కురుమూర్తి ఆలయానికి చేరుకొని మూల విరాట్ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాతరోడ్డు మార్గాన తిరిగి హైదరాబాద్ బయల్దేరతారు.