అభివృద్ధిపై చర్చకు ఏ ఊరికి రావాలో చెప్పు: షబ్బీర్​ అలీ

  • ఎమ్మెల్యే గంప గోవర్ధన్​కు మాజీ మంత్రి షబ్బీర్​ అలీ సవాల్​
  • ఎవరొచ్చినా కామారెడ్డిలో కాంగ్రెస్​దే గెలుపు

కామారెడ్డి, వెలుగు: అభివృద్ధిపై చర్చించేందుకు ఏ ఊరికి రావాలో చెప్పు, వచ్చి నీ అసమర్థ పాలనను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని’  కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్​కు మాజీ మంత్రి షబ్బీర్ ​అలీ సవాల్​ విసివారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో మీటింగ్​లతో పాటు, మాచారెడ్డి నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ ప్రోగ్రామ్​లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో ఆస్తులపై చర్చకు రమ్మని పిలిచి, నేను వచ్చేసరికి పారిపోయారు. ఇటీవల డబుల్​ బెడ్​రూమ్స్ ​విషయంలోనూ సవాలు విసిరి, పత్తా లేకుండా పోయారని’ అన్నారు. గ్రామాలకు వెళ్తే  ప్రజలు నిలదీస్తారని కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నారన్నారు. 

కేసీఆర్ ​సొంతూరు ఇక్కడే అంటున్నప్పుడు చింతమడకలో ఇచ్చినట్లు.. ఇక్కడ కూడా ఇంటికి రూ.10 లక్షలు ఇప్పించాలని డిమాండ్​చేశారు. కామారెడ్డిలో ఎవరొచ్చి పోటీ చేసినా గెలిచేది కాంగ్రెస్​ పార్టేనని షబ్బీర్​అలీ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్​ గిరిజన వ్యతిరేకి అని, పోడు పట్టాలు అందరికీ ఇవ్వకుండా వంచించారన్నారు. కాంగ్రెస్ ​అధికారంలోకి రాగానే పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న అర్హులందరికీ పట్టాలు ఇస్తామన్నారు. డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్​శ్రీనివాస్​రావు, వైస్ ​ప్రెసిడెంట్ మద్ది చంద్రకాంత్​రెడ్డి,  పీసీసీ అధికార ప్రతినిధి ఎడ్ల రాజిరెడ్డి, లీడర్లు గణేశ్ ​నాయక్, లక్ష్మారెడ్డి​ పాల్గొన్నారు.