- ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పు: బండి సంజయ్
రాజన్న సిరిసిల్ల/వేములవాడ, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి తన గుండు గురించి పక్కనపెట్టి, ఇచ్చిన హామీల అమలు సంగతి చెప్పాలని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ‘‘రేవంతన్నా.. నేను 6 గ్యారంటీల సంగతేమైందని అడిగితే.. గుండు, అరగుండు అంటూ హేళనగా మాట్లాడుతవా? ఐదేండ్లలో నేను చేసిన పోరాటాలు, కరీంనగర్ అభివృద్ధికి తెచ్చిన నిధులు నీకు కన్పించడం లేదా? నా గుండుతో నీకేం పని? దమ్ముంటే ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పు’’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు.
సీఎం హోదాలో ఉన్న రేవంత్ వాడుతున్న భాషను జనం అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఎంత డ్రామాలాడినా, హేళన చేసినా.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చే సీట్లు గుండు సున్నానే అని ఎద్దేవా చేశారు. మంగళవారం సిరి సిల్ల పట్టణంలో బీజేపీ కార్యకర్తల సమావేశం అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. జమ్మికుంటలో సీఎం రేవంత్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరిస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమన్నారు.
దేవుడి పేరు చెప్పుకోవడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదంటున్న రేవంత్ రెడ్డికి చివరకు దేవుడే దిక్కయిండని.. అందుకే దేవుడిపై ఒట్టేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ పేరుతో ఒక వర్గం ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.
రాజకీయాలు నీచంగా మారినయ్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడితే.. ప్రస్తుతం కాంగ్రెస్ ఫేక్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తోందని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఈ పదేండ్లలో రాష్ట్ర రాజకీయాలు నీచంగా మారాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రతిపక్షాల లీడర్లు, చివరికి భార్యాభర్తల మాటలను కూడా విన్నదని విమర్శించారు. సిరిసిల్ల అడ్డాగా ట్యాపింగ్ జరిగిందన్నారు. మాదిగ సమాజంపై అవాకులు చెవాకులు పేలుతున్న మానకొండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ నెల 8న వేములవాడలో ప్రధాని మోదీ పాల్గొననున్న బహిరంగ సభకు ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం పార్టీ సమావేశంలో మాట్లాడారు. మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, లీడర్లు వికాస్ రావు, రాణిరుద్రమ, కుమ్మరి శంకర్, రేగుల మల్లికార్జున్, ఎర్రం మహేశ్ పాల్గొన్నారు.