- మొన్న సీఎంతో భేటీ.. నిన్న కేసీఆర్ మీటింగ్‌కు డుమ్మా
- బీఆర్ఎస్తో అంటీముట్టనట్టు వ్యవహారం
- నష్టనివారణకు హరీశ్‌రావు చర్యలు
భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఉన్న ఒక్కగానొక్క ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. తన రాజకీయ గురువు, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో కలిసి ఆయన ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. అధికారికంగా పార్టీ మారకపోయినా ఆయన కాంగ్రెస్‌తోనే కలసి నడవనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి తెల్లం వెంకటరావు కూడా కాంగ్రెస్‌లో చేరారు. భద్రాచలంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండడంవల్ల టికెట్ రాదని కన్ఫమ్ కావడంతో చివరి నిమిషంలో తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చి టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, పొంగులేటి మంత్రి కావడంతో వెంకటరావు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారన్న ఊహాగానాలు వచ్చాయి. తాను పార్టీ మారబోవడంలేదని, బీఆర్ఎస్తోనే ఉంటానని వెంకటరావు చెప్పినా.. పార్టీతో అంటీముట్టనట్టే ఉంటున్నారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం పర్యటనకు వస్తే ఆయన ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. ఆ తర్వాతి రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ, అన్నారం టూర్‌కు వెళ్లగా వెంకటరావు ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం.. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం ద్వారా ఆయన తన అంతరంగాన్ని స్పష్టం చేసినట్టయ్యిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
కేడర్ చేజారకుండా..
వెంకటరావు అడుగులను గమనిస్తున్న బీఆర్ఎస్ హైకమాండ్ నియోజకవర్గంలో కేడర్ చేజారిపోకుండా జాగ్రత్త పడుతోంది. మాజీ మంత్రి హరీశ్‌రావు భద్రాచలంపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం ఇన్చార్జిగా వ్యవహరించిన ఎమ్మెల్సీ తాతా మధు నియోజకవర్గంలో తాజా పరిస్థితులపై పార్టీ పెద్దలకు రిపోర్ట్ చేశారు. తెల్లం వెంకటరావు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని, ఆయన పార్టీతో కొనసాగే అవకాశంలేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దీంతో సోమవారం భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇన్చార్జి మానె రామకృష్ణను బీఆర్ఎస్మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాదుకు పిలిపించుకుని మాట్లాడారు. వెంకటరావు పార్టీ మారినా కేడర్ ను కాపాడుకోవాలని సూచించారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, హైకమాండ్ పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు.