ఆదివాసీ మహిళలకు జీవనోపాధి కల్పిస్తాం : తెల్లం వెంకట్రావు

ఆదివాసీ మహిళలకు జీవనోపాధి కల్పిస్తాం : తెల్లం వెంకట్రావు

భద్రాచలం, వెలుగు  : ఆదివాసీ మహిళలు తయారు చేసిన వివిధ ఉత్పత్తులను ట్రైఫ్డ్ సంస్థ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు డాక్టర్​ తెల్లం వెంకట్రావ్​, పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. ఐటీడీఏ గిరిజన భవనంలో శుక్రవారం ట్రైఫ్డ్ ఆధ్వర్యంలో గిరిజనుల హస్తకళల, అటవీ, చేనేత ఉత్పత్తుల ప్రదర్శన మేళాను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీ మహిళలతో సొసైటీలు ఏర్పాటు చేసి, వారికి ట్రైనింగ్​ ఇప్పించి ఉత్పత్తులు తయారు చేయించి వారి జీవనోపాధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఈ వస్తువులు తెలుగు రాష్ట్రాలే కాకుండా మెట్రో సిటీల్లో కూడా ప్రదర్శనకు పెట్టి అమ్మనున్నట్లు చెప్పారు. ట్రైఫ్డ్ రీజనల్​ మేనేజర్​ శ్రీనివాస్​ సంకె మాట్లాడుతూ ఆరు వేల గిరిజన కుటుంబాలను గుర్తించి వారికి ట్రైనింగ్​ ఇచ్చి వారు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్​ కల్పిస్తున్నామన్నారు. మేళాను ఎమ్మెల్యేలు పరిశీలించి ఆదివాసీల ప్రతిభను మెచ్చుకున్నారు. ఓ ఆదివాసీ యువకుడు ఎమ్మెల్యే తెల్లం చిత్రాన్ని గీసి బహుకరించాడు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్​రాజ్, ఎస్వో సురేశ్​కుమార్, జీసీసీ డీఎం దావీదు పాల్గొన్నారు.