మంచు బ్రదర్స్​ బైండోవర్: రాచకొండ సీపీ ముందు విడివిడిగా హాజరైన విష్ణు, మనోజ్​

  • ఇంటి పంచాదిపై అన్నదమ్ముల వివరణ
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని సీపీ వార్నింగ్‌‌‌‌
  • ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున బాండ్‌‌‌‌
  • అనారోగ్యంతో హాజరుకాని మోహన్‌‌‌‌బాబు
  • పోలీసుల అదుపులో ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌
  • మేనేజర్‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌, మరో వ్యక్తి విజయ్‌‌‌‌రెడ్డి
  • జర్నలిస్టులపై మోహన్​బాబు దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు
  • హత్యాయత్నం కేసు పెట్టి..అరెస్ట్​ చేయాలని డిమాండ్​
  • ఫిల్మ్​ చాంబర్​, రాచకొండ సీపీ ఆఫీసు ముందు నిరసన

హైదరాబాద్‌‌, వెలుగు: సినీ నటుడు మంచు మోహన్‌‌బాబు కుటుంబ కల హాల కేసులో కీలకపరిణామాలు చోటుచేసుకున్నాయి. మోహన్​బాబు పెద్దకొడుకు విష్ణు, చిన్నకొడుకు మనోజ్​ను ఎగ్జిక్యూటీవ్‌‌ మెజిస్ట్రేట్‌‌ హోదాలో రాచ కొండ సీపీ సుధీర్‌‌‌‌బాబు విచారించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని, విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్​ ఇచ్చారు. వ్యక్తిగత పూచికత్తు కింద ఒక్కొక్కరి వద్ద  లక్ష రూపాయల చొప్పున పర్సనల్‌‌ బాండ్‌‌ డిపాజిట్‌‌ చేయించుకున్నారు.

మరోవైపు మంచు మనోజ్‌‌పై జరిగిన దాడి కేసులో మోహన్‌‌బాబు ఫామ్‌‌హౌస్‌‌ మేనేజర్‌‌‌‌ కిరణ్‌‌కుమార్‌‌తోపాటు మరో వ్యక్తి విజయ్‌‌రెడ్డిని పహాడీషరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్‌‌స్టేషన్‌‌కు తరలించి విచారిస్తున్నారు. మనోజ్‌‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రశ్నిస్తున్నారు. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి.

విడివిడిగా సీపీ ముందు హాజరైన అన్నదమ్ములు

జల్​పల్లిలోని మోహన్​బాబు ఫామ్‌‌హౌస్‌‌లో జరిగిన లొల్లి, ఉద్రిక్రత పరిస్థితుల నేపథ్యంలో మోహన్‌‌బాబు, విష్ణు నుంచి లైసెన్డ్స్‌‌ గన్స్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌‌హౌస్ పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచారు. లా అండ్‌‌ ఆర్డర్‌‌‌‌కు విఘాతం కలుగకుండా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మోహన్‌‌బాబు, విష్ణు, మనోజ్​కు రాచకొండ సీపీ సుధీర్‌‌‌‌బాబు మంగళవారం రాత్రి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల మేరకు మనోజ్‌‌, విష్ణు‌‌ బుధవారం నేరేడ్‌‌మెట్‌‌లోని సీపీ ఆఫీసులో బైండోవర్​ అయ్యారు.

Also Read:-హైకోర్టుకు అల్లు అర్జున్..ఎందుకంటే.?

అస్వస్థత కారణంగా మోహన్‌‌బాబు పోలీసుల విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం గచ్చిబౌలి కాంటినెంటల్‌‌ హాస్పిటల్‌‌లో ట్రీట్‌‌మెంట్‌‌ పొందుతున్నారు. మనోజ్​, విష్ణు విడివిడిగా సీపీ సుధీర్‌‌‌‌బాబు ముందు హాజరయ్యారు. ముందుగా మనోజ్‌‌ సీపీని కలిశారు. ఘటనకు సంబంధించిన వివరాలను వివరించారు. తనపై జరిగిన దాడి సహా మోహన్‌‌బాబు, విష్ణుతో తనకు ఉన్న కుటుంబ కలహాలు, విద్యాసంస్థలకు సంబంధించిన విభేదాల గురించి స్టేట్‌‌మెంట్‌‌ ఇచ్చారు.

స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌ చేసి వార్నింగ్ ఇచ్చిన సీపీ

మనోజ్‌‌ సీపీ ఆఫీస్‌‌ నుంచి తిరిగివెళ్లిన తర్వాత రాత్రి 8 గంటల సమయంలో విష్ణు సీపీ సుధీర్‌‌‌‌బాబు ముందు హాజరయ్యారు. మనోజ్‌‌తో కుటుంబ కలహాలు ఎంతకాలంగా ఉన్నాయనే వివరాలను వెల్లడించారు. తన తండ్రి మోహన్‌‌బాబుతో విభేదించి మనోజ్‌‌ దంపతులు ఇంట్లో పలుమార్లు గొడవలు చేశారని ఆయన చెప్పారు. పెద్దలు కూర్చుని మాట్లాడుకునే అంశాలను రోడ్డున పడేశారని అన్నారు.

ప్రస్తుత పరిస్థితిలో తమ మధ్య నెలకొన్న వివాదాలను చట్టానికి లోబడి పరిష్కరించుకుంటామని సీపీకి ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీపీ సుధీర్‌‌బాబు ఆదేశాల మేరకు.. మనోజ్​, విష్ణు వ్యక్తిగత పూచికత్తుగా ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున పర్సనల్ బాండ్‌‌ అందించారు. లా అండ్ ఆర్డర్‌‌‌‌కు విఘాతం కలిగే విధంగా ఎలాంటి పబ్లిక్ న్యూసెన్స్ చేయబోమని హామీ ఇచ్చారు.

నేను ఉంటే ఇంత జరిగేది కాదు: విష్ణు

గచ్చిబౌలి, వెలుగు: తమ తండ్రి మోహన్​బాబు తమను ఎక్కువగా ప్రేమించడమే ఆయన చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు. ప్రతి కుటుంబం లో సమస్యలుంటాయని, ఎవరో ఒకరు తగ్గితే పరిష్కారమవుతాయని చెప్పారు. తమ ఇంటి సమస్యలను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేయొద్దని మీడియాను కోరారు. మంగ ళవారం జరిగిన ఘర్షణలో తన తండ్రికి గాయా లయ్యాయని తెలిపారు. ‘‘మా నాన్న స్వయం కృషితో సంపాదించుకున్న ఆస్తి ఆయన సొంతం. నేను కన్నప్ప సినిమా కారణంగా రెండుమూడ్రోజులు సిటీలో లేకపోవడంతో కుటుంబంలో సమస్యలు వచ్చాయి.

నేను ఉంటే ఇంత జరిగేది కాదు” అని అన్నారు. కాంటినెంట ల్ హాస్పిటల్​లో అడ్మిట్​ అయిన మోహన్​బాబును పరామర్శించేందుకు బుధవారం వచ్చిన విష్ణు.. అక్కడే మీడియాతో మాట్లాడారు. వినయ్ అనే వ్యక్తి తనకు అన్నలాంటి వాడని, తనకు 15 ఏండ్ల నుంచి తెలుసన్నారు. తమ విద్యాసంస్థల్లో ఎటువంటి అవకతవకలు జరుగ లేదని పేర్కొన్నారు. మనోజ్ ఇంట్లో ఉండేందుకు తన తండ్రి ఒప్పుకోలేదన్నారు.

మంగళవారం తమ ఇంట్లో రిపోర్టర్ మీద దాడి జరగలేదని, తమ ఇంటి గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చిన సందర్భంలో ఈ ఘటన జరిగిందని, గాయపడిన రిపోర్టర్ కుటుంబంతో టచ్​లో ఉన్నామని విష్ణు తెలిపారు. తాము పబ్లిక్ ఫిగర్​లు కావచ్చు కానీ, తమకు వ్యక్తిగత విషయాలు ఉంటాయని ఆయన అన్నారు. కాగా.. హైబీపీ, కొన్ని గాయాలతో మోహన్​బాబు అడ్మిట్​ అయ్యారని డాక్టర్లు బులిటెన్ విడుదల చేశారు.