నిజానికి ఉన్న పవర్ అది .. రాజ్యాంగం, లాయర్లపై మరింత గౌరవం పెరిగింది : ప్రియదర్శి

నిజానికి ఉన్న పవర్ అది .. రాజ్యాంగం, లాయర్లపై మరింత గౌరవం పెరిగింది : ప్రియదర్శి

ప్రియదర్శి లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం ‘కోర్ట్‌‌‌‌‌‌‌‌- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’. హీరో నానికి చెందిన  వాల్ పోస్టర్ సినిమా సంస్థ సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా కో ప్రొడ్యూసర్. మార్చి 14న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రియదర్శి ఇలా ముచ్చటించాడు. 

 ‘‘మూడేళ్ల క్రితం ఈ స్టోరీ ఐడియా చెప్పాడు రామ్ జగదీష్. ఆరు నెలల తర్వాత కథ పూర్తిగా రాసుకొచ్చి మళ్లీ వినిపించాడు. ‘హాయ్‌‌‌‌‌‌‌‌  నాన్న’ టైమ్‌‌‌‌‌‌‌‌లో నాని  గారికి చెబితే,  ఆ తర్వాత ఓసారి కథ విని వెంటనే ఓకే చేశారు. నిజానికి కథ ప్రకారం ఓ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాదించాల్సిన కేసు అది. కానీ కథ నచ్చి రిక్వెస్ట్ చేయడంతో నాకు తగ్గట్టుగా మార్పులు చేశారు. ఇలాంటి సినిమాల విషయంలో కోర్టులు, చట్టాల గురించి మనకు  కొంతమేర తెలిసుండాలి. అందుకోసం పలువురు లాయర్లు,  జడ్జీల  దగ్గరకు వెళ్లి  నేరాలు, శిక్షలు లాంటి అంశాలపై ఓ మెటీరియల్ రెడీ చేశాడు దర్శకుడు. దాన్ని నేను కూడా చదవడం ఎంతో హెల్ప్ అయింది.  

లాయర్ల బాడీ లాంగ్వేజ్, జడ్జీల దగ్గర  ఎలా నడుచుకోవాలి,  అక్కడి భాష, సెక్షన్స్‌‌‌‌‌‌‌‌ లాంటి విషయాలు తెలుసుకుని, న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం రాకుండా జాగ్రత్తపడ్డాం. జిల్లా కోర్టులు,  పోక్సో కోర్టులు పరిశీలించి సినిమాటిక్‌‌‌‌‌‌‌‌గా కంటే రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా కోర్టును చూపించే ప్రయత్నం చేశాం.  ‘వకీల్‌‌‌‌‌‌‌‌సాబ్‌‌‌‌‌‌‌‌’లో పవన్‌‌‌‌‌‌‌‌ కళ్యాన్‌‌‌‌‌‌‌‌ గారు కావొచ్చు.. మరోచిత్రంలో ఇంకో హీరో కావొచ్చు, లాయర్ల పాత్రను ఎవరు పోషించినా వారిపై మనకు గౌరవం పెరుగుతుంది.  నిజానికి ఉన్న పవర్ అది. నాకైతే ఈ పాత్ర పోషించాక రాజ్యాంగం, లాయర్లపై మరింత గౌరవం పెరిగింది. త్వరలోనే కొందరు లాయర్స్‌‌‌‌‌‌‌‌, బార్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌కు సినిమా చూపించబోతున్నాం. 

ఇక ఈ సినిమా నచ్చకపోతే తన సినిమా ‘హిట్ 3’ చూడొద్దని నాని గారు అనడానికి కథపై ఉన్న  నమ్మకమే కారణం. ‘మన దగ్గర ఉన్న గుడ్ స్టోరీని గ్రేట్ స్టోరీగా తీయాలి’ అని కథ విన్న మొదటి రోజే ఆయన చెప్పారు. అలాగే కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నా నెక్స్ట్ మూవీ  ‘సారంగపాణి జాతకం’ ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో వస్తోంది.  ‘ప్రేమంటే’ చిత్రంతో పాటు గీతా ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌లో ఓ సినిమా చేస్తున్నా. ఎప్పటికైనా శాంతా బయోటెక్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్​ కె.ఐ వరప్రసాద్ గారి బయోపిక్‌‌‌‌‌‌‌‌లో  నటించాలనేది నా కోరిక’’.