సినీ నటుడు శ్రీతేజ్​పై కేసు

సినీ నటుడు శ్రీతేజ్​పై కేసు
  • పెండ్లి పేరుతో మోసం చేశాడని మహిళ ఫిర్యాదు

కూకట్​పల్లి, వెలుగు: సినీ నటుడు శ్రీతేజ్​పై కూకట్​పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పెండ్లి పేరుతో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీసులు ఫిర్యాదు చేసింది. ఏపీలోని ప్రకాశం జిల్లా కారంచేడుకు చెందిన మహిళ (35) మొయినాబాద్​లో నివాసం ఉంటోంది. కొన్నేండ్ల క్రితం శ్రీతేజ్​తో ఒక ఈవెంట్​లో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో తన భార్యకు విడాకులిచ్చి ఆ మహిళను పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన అవసరాలకు ఆమె వద్ద రూ. 20 లక్షలు తీసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 

తనను పెండ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి చేయడంతో శ్రీతేజ్​ తప్పించుకుని తిరుగుతున్నాడు. అతడు మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని గుర్తించిన బాధితురాలు.. గత ఏప్రిల్​లో కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ సమయంలో శ్రీతేజ్..​ బాధితురాలికి మాయమాటలు చెప్పి ఆ ఫిర్యాదుని వెనక్కు తీసుకునేలా చేశాడు. మళ్లీ ఎప్పటిలాగానే ప్రవర్తిస్తుండడంతో శ్రీతేజ్ పై ​ గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​లో ఆ మహిళ ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు.. కేసుని కూకట్​పల్లికి పోలీస్  స్టేషన్ కు బదిలీ చేశారు.