ఓటిటిలో మలయాళానికే ప్రేక్షకుల ఓట్లు..

ఎంటర్టైన్మెంట్ రంగంలోకి  ఓటిటి ఎంటరయ్యాక..చిత్ర ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడ సినిమాలు తెరకెక్కినా...ఏ సినిమాలు విడుదలైనా..మన నట్టింట్లో కూర్చోని ఓటిటిలో చూసే అవకాశం లభించింది. ఓటిటిలో నచ్చిన వాటిని..మెచ్చిన వాటిని..ఇష్టంగా ఎంచుకుని మరీ చూస్తున్నారు  ప్రేక్షకులు. అయితే గతంలో తెలుగు సినిమాలు మాత్రమే చూసే ఆడియన్...ఓటిటి వచ్చాక ఇతర భాషల సినిమాలపై ఆసక్తి కనభరుస్తున్నారు. ఈ క్రమంలో వారికి మలయాళం మూవీస్ బెస్ట్‌ చాయిస్గా మారిపోయాయి. ఓటీటీల ద్వారా చాలా మలయాళ సినిమాల తెలుగు వెర్షన్లు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ప్రేక్షకుల మనసు దోచుకున్నాయి. దీంతో ఇప్పుడు తెలుగు వెర్షన్ వచ్చేలోపే భాష రాకపోయినా మలయాళ సినిమాలు చూడటానికి ఆరాపడుతున్నారు సినీ లవర్స్. 

హద్దులు చెరిపేసి..
ఓ సినిమా హద్దులు దాటి... ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారిని మెప్పిస్తోందంటే అది వారికి ఎంతగా కనెక్ట్ అయి ఉండాలి..! అవును మలయాళ సినిమా కచ్చితంగా కనెక్ట్ అయింది కాబట్టే.. మన మనసంతా ఆ సినిమాల మీద ఉంటోంది. మలయాళం మూవీపై ఇంట్రస్ట్ పెరగడానికి కారణం.. కాన్సెప్ట్.  సినిమా విజయం ఆ కాన్సెప్ట్ను ఎంచుకోవడంలోనే ఉంటుందంటారు మలయాళీ మేకర్స్. వాళ్లు జీవితానికి చాలా దగ్గరగా ఉండే కథలను ఎంపిక చేసుకుని సినిమాలుగా తీస్తుంటారు. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌ మూవీ కూడా అలాంటిదే. మనిషిలో సహజంగా ఉండే ఇగోను ఇందులో చూపించారు. ఇలాంటి క్యారెక్టర్ ఉన్నవాళ్లు మన మధ్యే ఉంటారు. ఒక్కోసారి మనలోనే బయపడుతుంటాడు. అందుకే అందరూ కనెక్టవుతారు. మలయాళ దర్శకుడు మహిళల సమస్యల్ని చర్చిస్తారు. కుల, మత బేధాల గురించి చూపిస్తారు. కుటుంబ విలువలను కళ్లకు కట్టినట్లు తెరకెక్కిస్తారు.  డ్రగ్స్, మాఫియా, టెర్రిరిజం, బుల్లీయింగ్, సైబర్ క్రైమ్స్‌ అంటూ అదీ ఇదీ కాదు.. సొసైటీకి ఉపయోగపడేవి, ప్రేక్షకులు తమను తాము రిలేట్ చేసి చూసుకునే కథలు ఎంచుకుంటారు. అందుకే మలయాళ సినిమా  హద్దులు చెరిపేస్తూ..మనది అనే ఫీల్ ను ఇస్తోంది. 

పర్‌‌ఫెక్ట్ స్క్రిప్ట్స్‌..
సినిమా బాగుందని నిజాయితీగా చెప్పడం అంత ఈజీ కాదు. రెండున్నర గంటల సమయం ప్రేక్షకుడికి తెలియకుండానే గడిచిపోయినప్పుడు గుడ్ మూవీగా అభివర్ణిస్తాడు. ఆడియెన్స్ను ఎంగేజ్ చేయగలిగేదే మంచి సినిమా. అలాంటి సినిమాలు మలయాళంలో వస్తున్నాయని గ్రహించారు ప్రేక్షకులు. అందుకే వాటిపై మక్కువ పెంచుకున్నారు. ‘దృశ్యం’ సినిమా ఒరిజినల్ వెర్షన్‌ చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు. వెంకటేష్‌ నటించిన రీమేక్‌నే చూశారు. ఒక సినిమాలో ఇన్ని మలుపులా అంటూ ఆశ్చర్యపోయారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌‌కి పర్‌‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటూ కితాబిచ్చేశారు. ఆ తర్వాత తెలుసుకున్నారు సినిమా మలయాళ రీమెక్ అని. ఇక సీక్వెల్ సమయంలో తెలుగు వెర్షన్ వచ్చేవరకు ఆగలేదు. మలయాళ వెర్షన్ విడుదలవగానే ఓటీటీల్లో పోటీపడి చూశారు. ఆ భాష రాకపోయినా ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌ చదువుకుంటూ చూసేశారంటే ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనంతటికీ కారణం ఆ సినిమాల నేరేషనే. స్టోరీ ఏదైనా సూపర్బ్‌ స్క్రీన్‌ప్లేతో ప్రెజెంట్ చేయడంలో మలయాళ మూవీ మేకర్స్‌ ఎక్స్పర్ట్స్. అందుకే అక్కడ కథే హీరో.

క్యారెక్టర్‌‌ ముఖ్యం.. స్టార్ కాదు..
మలయాళ సినిమాల్ని పరిశీలిస్తే మనకి ఓ విషయం అర్థమవుతుంది. వాళ్లు కథకి తగ్గ హీరోని తీసుకుంటారు తప్ప.. హీరోకి తగ్గట్టుగా కథని మార్చుకోరు. హీరోలు సైతం క్యారెక్టరే ముఖ్యమన్నట్టుగా నటిస్తారు తప్ప ఇమేజ్‌ కోసం పాకులాడరు. ఉదాహరణకి ‘దృశ్యం’సినిమానే తీసుకుందాం. ఇందులో  నటించిన మోహన్‌లాల్..మలయాళ సూపర్ స్టార్. కానీ మూవీలో పోలీసులు చిత్రహింసలు పెడతారు. ఎడా పెడా కొడతారు. ఇక రీసెంట్‌గా వచ్చిన ‘పుళు’ మూవీ చూస్తే అసలు ఇలాంటి రోల్ చేయడానికి మమ్ముట్టి ఎలా ఒప్పుకున్నారా అనిపిస్తుంది. దీనిని బట్టి తెలుస్తుంది మలయాళంలో స్టార్ హీరోలు ఇమేజ్‌ని పట్టించుకోరు.., క్యారెక్టర్ గురించి మాత్రమే ఆలోచిస్తారని.  పృథ్విరాజ్‌ ‘జనగణమన’ ఇటీవలే రిలీజై సక్సెస్ అయ్యింది. అయితే ఈ మూవీలో టైటిల్స్ పడకముందు హీరో ఓసారి కనిపిస్తాడు. ఇక అంతే సెకెండాఫ్‌ వరకు కనిపించడు. కథ మాత్రమే సాగుతూ పోతుంది. అవసరం పడినప్పుడు మాత్రం అతని పాత్ర ఎంటరవుతుంది. ఓ స్టార్‌‌ హీరో సగం సినిమాలో కనిపించకపోవడం మన సినిమాల్లో జరిగే పనేనా.  ఇక లూసిఫర్‌‌ సినిమాలో అయితే మోహన్‌లాల్‌కి అసలు హీరోయినే ఉండదు. పాటలు ఉండవు. పైగా ఆయన సమస్యల్లో పడినప్పుడు కాపాడటానికి మరో క్యారెక్టర్ వస్తుంది.  ఈ సింప్లిసిటీయే ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. మలయాళ సినిమాల వైపు మనసును మళ్లిస్తుంది. 

రియలిస్టిక్ అప్రోచ్..
మన సినిమాల్లో.. కథ సీరియస్‌గా జరుగుతూ ఉంటుంది. హీరో ఎవరికో గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది చూసి హీరోయిన్‌ డ్రీమ్లోకి వెళ్లిపోతుంది. అది కూడా లోకల్‌గా కాదు.. ఏ ఇటలీనో ప్యారిసో వెళ్లిపోతుంది. ఇది మనకి చూసి చూసి అలవాటైపోయింది. అలా ఎలా సాధ్యం అని ఆలోచించడం కూడా మానేశాం. లొకేషన్లు బాగున్నాయి కదా, హీరో స్టెప్స్ అదిరాయి కదా అంటూ ఇష్టంగా చూసేస్తున్నాం. కానీ ఆ ఇష్టాన్ని కాస్త తగ్గించాయి మలయాళీ సినిమాలు. వాళ్ల కాన్సెప్టులు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. వాటిని ప్రెజెంట్ చేసే విధానం కూడా చాలా నేచురల్‌గా ఉంటుంది. పాత్రలు మనలాంటి మనుషుల్లానే అనిపిస్తాయి. అక్కడ డ్రీమ్ సాంగులు ఉండవు. హీరోల ఎలివేషన్లు కనిపించవు.  అవసరం లేదనుకుంటే పాటలు, ఫైట్లు, కామెడీ అన్నింటినీ పక్కన పెట్టేసి అసలు కథమీదే సినిమాని నడిపించేస్తారు. అదే ప్రేక్షకులకు చాలా నచ్చుతోంది. అలా అని వాళ్లు కమర్షియల్ సినిమాలు తీయరనుకుంటే పొరపాటే. కమర్షియల్ సినిమాల్ని కూడా నేచురల్‌గా తీయడమే వారి స్పెషాలిటీ.

బడ్జెట్ బాధల్లేవ్..
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఈ మూడు ఇండస్ట్రీస్‌లో బడ్జెట్‌ అనేది ప్రెస్టీజ్ ఇష్యూ అయిపోయిందిప్పుడు. ఎంత ఎక్కువ బడ్జెట్ పెడితే అంత గొప్ప అన్న పరిస్థితి ఏర్పడింది. ఇక పాన్‌ ఇండియా కాన్సెప్ట్ వచ్చాక సినిమాల బడ్జెట్ మరీ గీత దాటేస్తోంది.  మాలీవుడ్‌లో మాత్రం ఈ సమస్య ఎప్పుడూ లేదు. వాళ్లు రిచ్‌నెస్‌ కోసం ఆలోచించరు. నేచురాలిటీ కోసమే ట్రై చేస్తారు. కథ డిమాండ్ చేస్తే తప్ప రాష్ట్రం దాటరు. మరీ అవసరమైతే తప్ప దేశ దాటేందుకు విమానమెక్కరు. అందుబాటులో ఉన్న లొకేషన్స్లోనే షూట్ చేసేస్తారు. పెద్ద పెద్ద సెట్స్ అవసరం కూడా ఉండవు. స్టూడియోస్, గెస్ట్ హౌసుల్లో పని కానిచ్చేస్తారు. అందుకే సినిమా బడ్జెట్‌ ఎప్పుడూ అదుపులోనే ఉంటుంది. ఇది చాలా కరెక్ట్ అంటాడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. చిన్న బడ్జెట్‌ ఎక్కువ ఎక్పైర్మెంట్స్ చేయడానికి ఉపయోగపడుతుందని, ఎప్పుడైతే బడ్జెట్ పెంచుకుంటూ పోతామో లిమిటేషన్స్ ఏర్పడతాయని అంటారాయన. ఆ మధ్య రాజమౌళి కూడా మలయాళ ఇండస్ట్రీలో ఉన్న డిసిప్లిన్ మన దగ్గర లేకపోవడం వల్లే ‘RRR’లో వేలాదిమంది జూనియర్ ఆర్టిస్టుల్ని వాడాల్సి వచ్చిందన్నారు. మాలీవుడ్ లా ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోతే ఈ సమస్య రాదని అన్నారు. ఈ టెక్నిక్స్ అన్నీ మాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్కు  బాగా తెలుసు. అందుకే వాళ్లకి ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. వాళ్లు సహజసిద్ధంగా తీస్తున్న సినిమాలపై మన ప్రేక్షకులకు మక్కువ.

రీమేక్స్ నెగ్గుతాయా?
మన తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాల తెలుగు వెర్షన్లను ఎంతో ఇష్టంగా చూస్తున్నారు సరే. రీమేక్స్ను కూడా అంతే ఆసక్తితో చూస్తారా అంటే మాత్రం అవును అని ఠక్కున చెప్పలేం. మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయ్యిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీని తెలుగులో ‘భీమ్లానాయక్‌’గా రీమేక్ చేశారు. అయితే ఇది అనుకున్నంత పెద్ద హిట్ కాలేదు. మిక్స్డ్ టాక్ను  తెచ్చుకుంది. స్టార్ హీరో నటించడం వల్ల.. ఆయనకి తగ్గట్టుగా కథను అటూ ఇటూ చేయడం వల్ల ఒరిజినాలిటీ దెబ్బ తిన్నదని చాలామంది అభిప్రాయపడ్డారు. రీసెంట్‌గా వచ్చిన ‘శేఖర్‌‌’ కూడా మలయాళ రీమేకే. త్వరలో రానున్న చిరంజీవి ‘లూసిఫర్’ కూడా మలయాళ రీమేక్. దీని విషయంలో కూడా రకరకాల కామెంట్స్ వినబడుతున్నాయి. ఎప్పుడైతే హీరో ఇమేజ్‌కి తగ్గ మార్పులు చేస్తున్నాం అని దర్శకులు చెబుతున్నారో ఆ రీమేక్స్ మీద ఆశలు వదిలేసుకుంటున్నారు ప్రేక్షకులు. ఎందుకంటే వాళ్లు మలయాళ సినిమాలను ఇష్టపడుతున్నదే వాళ్ల టేకింగ్, మేకింగ్ చూసి. దాన్ని మార్చేసేటప్పుడు ఆ కాన్సెప్టుని తెచ్చుకోవడం ఎందుకు అనేది కామన్ ఆడియెన్ అడుగుతున్న ప్రశ్న. మరి దీనికి మన ఫిల్మ్ మేకర్స్ ఏమంటారో