ఆర్థిక ఇబ్బందులతో తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణాలు

నిర్మల్, వెలుగు:  మహిళల  సాధికారత కోసం ఏర్పాటు చేసిన ‘తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణాలు’   ఆర్థిక ఇబ్బందులతో వెలవెలబోతున్నాయి.    ఉమ్మడి పది జిల్లాల్లో  మొత్తం 10  ప్రాంగణాలను  అప్పట్లో ప్రారంభించారు. మొదట్లో శిక్షణా కార్యక్రమా లతో ఈ ప్రాంగణాలన్నీ కళకళలాడేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే వీటి పేరును దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం గా మార్చారు.   మొదట వీటికి ఫండింగ్​ అంతా స్టేట్ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసేది.  ఆ తర్వాత  కార్పొరేషన్ ను తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ పరిధిలోకి చేర్చారు. 

వీటి కోసం ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున స్థలాలను  సేకరించారు.  నిర్మల్ జిల్లాలో మొదట 13 ఎకరాల స్థలాన్ని  కేటా యించారు. ఈ స్థలంలో పరిపాలన భవనంతో పాటు వివిధ రకాల శిక్షణ కోసం వర్క్ షెడ్లను, హాస్టల్ భవనాన్ని కూడా  కట్టారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ మహిళా ప్రాంగణాలు మహిళలకు శిక్షణ, పునరావాసం   లాంటి కార్యకలాపాలతో బిజీగా ఉండేవి.  తెలంగాణ రాష్ట్రం ఏర్ప డిన తర్వాత  క్రమంగా నిధుల కొరత ఏర్పడింది. ప్రస్తుత దుర్గాబాయి మ హిళా శిశు వికాస కేంద్రాలన్నీ నిర్వీర్య దశకు చేరుకుంటున్నాయి. ప్రభుత్వం నుంచి  నిధులు లేకపోవడంతో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నారంటున్నారు. 

అనేక శిక్షణలు..

మొదట్లో టైల రింగ్, ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ స్కిల్స్ డెవలప్మెంట్, బేకరీ, బుక్ బైండింగ్, ఆఫీస్ మేనేజ్మెంట్, ఎలక్ట్రికల్ అప్లయిన్సెస్, బ్యూటీషియన్, కంప్యూటర్  , డ్రైవింగ్ లో శిక్షణ   కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగేవి. వీటికి తోడుగా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ శిక్షణ ,  అంగన్వాడి వర్కర్లకు కూడా వృత్తిపరమైన శిక్షణను ఇక్కడే ఇచ్చేవారు.  అప్పటి ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ తో పాటు డీఆర్డీఏ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు, ఐటీడీఏ, ఐసిడిఎస్ లు శిక్షణ కార్యక్రమాలకు  స్పాన్సర్​  చేసేవి.    ప్రస్తుతం అటు మహిళా కార్పొరేషన్ నుంచి గాని ఇటు వివిధ కార్పొరేషన్ల నుంచి గాని  నిధులు తగ్గిపోవడంతో  ఉపాధి శిక్షణలకు దూరమవుతున్నాయంటున్నారు. భవనాలు ఇతర అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైన ప్రోత్సాహం లేక ఈ కేంద్రాలలో మహిళలకు ఆధునిక ఉపాధి అవకాశాలు గల కోర్సులలో శిక్షణలు ఇవ్వలేకపోతున్నారంటున్నారు.

ఇతర విభాగాలకు స్థలాల కేటాయింపు...

 నిర్మల్ లోని శిశువికాస కేంద్రానికి కేటాయించిన స్థలంలో ఆరెకరాలను  ఇటీవలే  మైనార్టీ ఉమెన్స్ కాలేజీ కోసం కేటాయించారు.   ప్రస్తుతం మహిళా శిశు వికాస కేంద్రాలలో విశాలమైన గదులు,   ఆహ్లా దకరమైన వాతావరణం, అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్న కార ణంగా ఇక్కడ మహిళలకు సరికొత్త స్వయం ఉపాధి కోర్సులను అందిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులందరూ లక్షల రూపాయలు పెట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. బీసీ ఎస్సీ స్టడీ సెంటర్ల ద్వారా వీరందరికీ ఇక్కడి మహిళా శిశు వికాస కేంద్రాలలో శిక్షణలు అందిస్తే మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు.

జిల్లాలు విడిపోవడంతో సమస్య...

కొత్త జిల్లాలు ఏర్పడడంతో మహిళా శిశు వికాస కేంద్రాలకు ఆయా సంస్థల స్పాన్సరింగ్ తగ్గిపోయింది. ముఖ్యంగా డీఆర్డీఏ, ఐటీడీఏ, బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ లు గతంలో స్పాన్సర్​ చేసేవి. ప్రస్తుతం తమ తమ జిల్లాల్లోనే ఈ సంస్థలు మహిళలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.   జిల్లా కేంద్రాలలోనే శిక్షణలు కొనసాగుతున్నాయి. దీంతో మహిళా శిశు వికాస కేంద్రాలలో జరుగుతున్న శిక్షణలకు దూర ప్రాంత జిల్లాల మహిళలు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం  అందుబాటులో ఉన్న శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం.
- విజయలక్ష్మి, పీడీ, మహిళా శిశు వికాస కేంద్రం, చించోలి బి, నిర్మల్