మంత్రి కొండా సురేఖ V/s సినీ ఇండస్ట్రీ..

మంత్రి కొండా సురేఖ V/s  సినీ ఇండస్ట్రీ..

రాజకీయంగా మాజీ మంత్రి కేటీఆర్ను విమర్శించే క్రమంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సినీ నటుడు నాగ చైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి చేసిన ఆమె ఆరోపణలపై సినీ ఇండస్ట్రీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, పెద్దలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపైన వ్యతిరేకిస్తాం అని ముందుకొస్తున్నారు. 

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ X ద్వారా స్పందిస్తూ.. " గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని సినీ ప్రముఖుల పేర్లు వాడుకోవడం.. ముఖ్యంగా మహిళ సెలబ్రిటీలపై  అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు.. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్ర పరిశ్రమగా మేము ఏకతాటిపై వ్యతిరేకిస్తామని.. కల్పిత ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచేందుకు సినిమా వాళ్ల పేర్లు వాడుకుంటూ తమ స్థాయిని దిగజారకూడదని సూచించారు. గౌరవ ప్రదమైన రాజకీయ నేతలు ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించాలని" చిరంజీవి ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు. 

అలాగే.. మంత్రి సురేఖ వ్యాఖ్యలపై హీరో వెంకటేష్ స్పందిస్తూ.. "బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరం.. పబ్లిక్ లో మాట్లాడేటపుడు తమ గౌరవాన్ని కాపాడుకోవడం నైతిక బాధ్యత ఎంతగానో ఉందని తెలిపారు" వెంకటేష్. 

అల్లు అర్జున్ స్పందిస్తూ.. " సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా, మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉంది. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించకూడదని" అల్లు అర్జున్ అన్నారు. 

"కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజా జీవితంలో.. ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించాలి. బాధ్యతారాహిత్యంగా సినీ పరిశ్రమపై నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. మనం దీని కంటే పైకి ఎదగాలి. ఇతరుల పట్ల గౌరవాన్ని కొనసాగించాలి. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను సమాజం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదు.." అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.