తెలుగు పాఠ్యాంశాలను పునఃసమీక్షించాలి

తెలుగు పాఠ్యాంశాలను పునఃసమీక్షించాలి

గత ప్రభుత్వం ముద్రించిన తెలుగు పాఠ్యపుస్తకాలలో కొన్ని పాఠ్యాంశాలు ఒక పార్టీకి అనుకూలంగా,  మరికొన్ని విద్యార్థులకు  అనవసరమైన పాఠ్యాంశాలు ముద్రితమై ఉన్నాయి. అధిక సిలబస్ ఉండడంతో విద్యార్థుల గుణాత్మక, సృజనాత్మక శక్తులు సన్నగిల్లే అవకాశం ఉంది.  పదవ తరగతి విద్యార్థులకు సంబంధించిన పాఠ్యపుస్తకంలో 5వ  పాఠం  నగరగీతంలో  కవి పట్టణంలో  నివసించడం,  ప్రతికూల అంశాల గురించి పట్టణ నగరీకరణ గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉండడం..  నేడు  పట్టణాలలో  నివసించే  పౌరుల అస్తిత్వాన్ని  దెబ్బతీసే విధంగా ఉంది.  

పట్టణాల కంటే పల్లెలో నివసించడమే బాగుంటుందనే ధోరణి విద్యార్థులలో నెలకొనే అవకాశం ఉంది.  నేడు  గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు విద్య కోసం,  ఉపాధి  అవకాశాల  కోసం  వలస వెళ్లిన వారందరి చేత ఈ పాఠం విమర్శలకు గురవుతున్నది.  8వ పాఠం లక్ష్య సిద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి,  పోరాట ఉద్యమాల గురించి,  ఆంక్షల ధిక్కరణ గురించి తెలియజేయడం జరిగింది.  


గత ప్రభుత్వానికి అనుకూలంగా ఈ పాఠం ఉన్నందున విద్యార్థులపై రాజకీయ అంశాల ప్రభావం పడే అవకాశం ఉన్నది. పరీక్షలలో కూడా బంగారు తెలంగాణ సాధించడానికి విద్యార్థుల అభిప్రాయాల్ని అడుగుతున్నారు. 10వ పాఠం గోలకొండ పట్టణంలో  కుతుబ్ షాహీల పరిపాలన గురించి,  వారి రాచరిక వ్యవస్థ ఏ విధంగా ఉండేదో తెలియచేయబడింది.  4వ పాఠం కొత్త బాట పూర్తిగా మాండలిక భాషలో ఉండడంవల్ల విద్యార్థులు చదవడానికి, అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. 

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలి

9వ తరగతిలో 6వ పాఠం దీక్షకు సిద్ధం కండి.. ఈ పాఠంలో 1969 తెలంగాణ ఉద్యమం కోసం ఎలాంటి నిరసనలు వ్యక్తం చేయాలో  నేడు విద్యార్థులు నేర్చుకోవడం అప్రస్తుతం. 8వ పాఠం ఉద్యమ స్ఫూర్తిలో నేటి రాజకీయ అంశాల పట్ల,  రాజకీయ నాయకుల పట్ల విమర్శించే రీతిలో ఉండటం వల్ల ప్రస్తుత ప్రభుత్వంపై అసహనం వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. 10వ పాఠం వాగ్భూషణంలో  వ్యాసం అధికంగా ఉండటంతో విద్యార్థులకు  వక్తృత్వం మీద అనాసక్తి ఏర్పడుతున్నది.  
11వ పాఠం  వాయసంలో కాకి గురించి అద్భుతంగా పద్యాల ద్వారా చెప్పినప్పటికీ ఈ పాఠం విద్యార్థులను ఆకట్టుకోలేకపోతున్నది.  

8వ తరగతి  తెలుగు వాచకంలో 9వ పాఠం అమరులులో 1969 తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసినవారిని స్మరిస్తూ తెలంగాణ రాష్ట్రం సాధిస్తాం అని ఉండడం వల్ల.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు ఈ పాఠ్యాంశం 
అప్రస్తుతం. 12వ పాఠం మాట్లాడే నాగలి మలయాళ భాష అనువాదంగా ప్రచురించిన ఈ పాఠంలో ఎద్దు మాంసం తినడం గురించి ఉండడంతో ఉపాధ్యాయులు బోధించాలంటే ఇబ్బంది పడుతున్నారు.  దీనివల్ల కేరళ ప్రజలు అంటే ఎద్దు మాంసం తింటారని విద్యార్థులు అర్థం చేసుకుంటున్నారు.  

8వ తరగతి ఉపవాచకంలో 1వ పాఠం చిత్రగ్రీవం పాఠం విద్యార్థులకు అదనపు భారంగా ఉంది. అదేవిధంగా ఉన్నత తరగతులలో సిలబస్​లో 12పాఠాలు, 
6 పాఠాలు ఉపవాచకంలో ఉన్నాయి.  
ఈ సిలబస్ అధికంగా ఉండడం వల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం, విద్యాశాఖ విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్​లో మార్పులు చేయాలని విద్యార్థులు,  వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.


 కృష్ణమూర్తి. కె
తెలుగు భాషా నిపుణుడు