తెలంగాణలో సైకిల్ సవారీ!

తెలంగాణలో సైకిల్ సవారీ!
  •  ఏపీలో గెలుపుతో తెలంగాణ తమ్ముళ్ల ఉత్సాహం
  • సుప్త చేతనావస్థలో ఉన్న పార్టీకి జవసత్వాలు
  • పట్టున్న ప్రాంతాల్లో ఎంట్రీ ఇచ్చి రాష్ట్రమంతా విస్తరించే ప్లాన్
  • బీఆర్ఎస్ ను క్లోజ్ చేయడమే లక్ష్యంగా స్కెచ్
  • హాట్ టాపిక్ గా మారిన సైకిల్ పాలిటిక్స్


హైదరాబాద్: ఏపీలో గెలుపు తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపింది. అదే ఉత్సాహంతో సైకిల్ సవారీకి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టీడీపీ ప్రాభవం కోల్పోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ.. 14.55% ఓట్లను పొందగలిగింది.  ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలకు పడిపోయింది. ఓట్ల శాతం కూడా 3.51శాతానికి పడిపోయింది. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేయగా కాంగ్రెస్ కు 19 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఆ తర్వాత 2023లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ సిద్దమైంది.

 కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఖమ్మం, సికింద్రాబాద్ లలో భారీ బహిరంగసభలు నిర్వహించిన చంద్రబాబు తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల  నోటిఫికేషన్ వెలువడిన సమయంలో చంద్రబాబు అరెస్టయ్యారు. రాజమండ్రి జైల్లో ఉన్నారు. తెలంగాణలో పోటీకి నిరాకరించడంతో కలత చెందిన కాసాని నేరుగా హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో అప్పటి దాకా ఊపు మీదున్న తమ్ముళ్లు ఒక్క సారిగా డీలా పడిపోయారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు నుంచి టీడీపీ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగిన నామా నాగేశ్వర్ టీడీపీలో చేరి సైకిల్ గుర్తుపై పోటీ చేస్తారని  అది కాస్తా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారు. 

బీఆర్ఎస్ స్థానం భర్తీ చేసేలా..

తెలంగాణలో నిర్వీర్యమైన బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ అధినేత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ పార్టీని నేతలు వీడారు. కార్యకర్తలు తెలుగుదేశంతోనే ఉన్నారని  వారంతా అలాగే ఉన్నారు. ఈ సమయంలో పార్టీ ఎదుగుదలపై దృష్టిపెట్టడం సరైన నిర్ణయమని ఆయన భావిస్తున్నారు. కేంద్రంలో కూడా తెలుగుదేశం మద్దతు కీలకం కావడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లిన టీడీపీ నేతలంతా భవిష్యత్తు కోసం ఆలోచించి తిరిగి టీడీపీలోకి వస్తారనే అంచనాలున్నాయి.