హిందువులకు ఉగాది పండుగతోనే కొత్త పంచాంగం మొదలవుతుంది. ఈ సంవత్సరం ఉగాది మార్చి 22న శ్రీశోభకృత్ నామ సంవత్సర ఉగాదిగా జరుపుకుంటున్నం. ఉగాది అంటే ఉగస్త్య ఆది అని అర్థం. ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షుఅని అర్థాలు ఉన్నాయి. ‘ఆది’ అంటే మొదలు, ప్రారంభం అని అర్థం. అంటే ప్రపంచం జన్మ, ఆయుష్షులకు మొదటి రోజు కాబట్టి ఉగాది అయింది. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాఢ్యమినాడే అంటే ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికం.
ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయి . తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలలో ఉగాది పండుగను జరుపుకుంటారు. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను జరుపుకోవడం విశేషం. ఉగాది పండుగను వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తారు.
షడ్రుచుల పచ్చడి
షడ్రుచుల సమ్మిళితంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు. జీవితంలో ఎదుర్కొనే ఉత్సాహాన్ని, బాధ, కష్టం, సుఖం, సహనం, ఓర్పు, ఆనందం సమ్మిళితంగా ఈ ఉగాది పచ్చడి తయారు చేస్తారు. పచ్చడి తయారు చేసేటప్పుడు అందులో వేసే పదార్థాలలో వేప పువ్వు పాలు కొంచెం ఎక్కువగా ఉండేలా చూడాలి. కారణమేమనగా ఆ మాసంలో మాత్రమే దొరికే ఈ వేప పువ్వు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు.ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. ఈ పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రత్యేకగా నిలుస్తుంది. తీపి: బెల్లం– ఆనందానికి సంకేతం. ఉప్పు– జీవితంలో ఉత్సాహానికి సంకేతం. చేదు: వేప పువ్వు – బాధకలిగించే అనుభవాలు. పులుపు : చింతపండు – నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. వగరు : పచ్చి మామిడి ముక్కలు – కొత్త సవాళ్లు. కారం : మిరపపొడి – సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. ఈ షడ్రుచులన్నీ మన జీవితానికి మార్గాన్ని నిర్ధేశిస్తాయి.
ఉగాది గురించి వేర్వేరు కథనాలు
పురాణాల్లో చెప్పబడిన ప్రకారం వేదాలను సోమకుడు అనే రాక్షసుడు అపహరించి సముద్రంలో దాచి పెట్టాడు. అప్పుడు విష్ణువు మత్స్యావతారం ధరించి సోమకున్ని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడు. ఆ శుభ తరుణానికి పురస్కారంగా విష్ణు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చింది. చైత్ర శుద్ధ పాడ్యమినాడు విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది జరుపబడుతుందని చెప్పవచ్చు. మరొక చారిత్రక వృత్తాంతం ప్రకారం శాలివాహన చక్రవర్తి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు పట్టాభిషిక్తుడై, తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగ కర్తగా భాసిల్లిన కారణం వల్ల ఆ యోధుని గుర్తుగా ఉగాది ఆచరింపబడుతుంది. తోటి వెలుగు పాఠకులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
కాలానికి కొలమానం
ఇతర పండుగలు, వ్రతాల మాదిరిగా ఉగాది ఏదో ఒక దేవుడినో, దేవతనో, ఉద్దేశించి చేసుకొనేది కాదు. అనంతమైన కాలాన్ని మన వీలుకొద్దీ సంవత్సరంగా లెక్కించి సకలదేవతా స్వరూపంగా భావించి ఆచరిస్తున్నాం. ప్రతి దేశం, ప్రతి రాష్ట్రం, ఏదో ఒక కాలానుగుణంతో తమ సంప్రదాయానుగుణంగా, ‘సంవత్సరాది’ ని జరుపుకుంటాం. ఆచరించే విధానంలో తేడాలు ఉన్నా ఆశయం, ఆనందాలు ఒకటే. కంటికి కనిపించని కాలస్వరూపం తానేనని ‘కాలః కాలాయితా మహమ్’ అని అన్నారు గీతాచార్యుడు. తాను కాలాన్ని అని చెప్పుకున్న ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రుల గమనాలనే కాల నిర్ణయానికి ప్రామాణికంగా తీసుకుంటారు. ‘రుతునాం కుసుమాకరః’ (ఋతువుల్లో వసంతాన్ని) అన్న భగవానుడి మాటలను బట్టే వసంత రుతువుకు దాని ఆరంభం పండుగ ఉగాదికి గల ప్రాశస్త్యం విశదమవుతుంది. ఈరోజు (ఉగాది) నూతన సంవత్సరానికి ఆరంభం కనుక ‘సంవత్సరాది’ అని వ్యవహరిస్తాం.
- స్వప్న కొండ,
తెలుగు ఉపాధ్యాయురాలు,
సికింద్రాబాద్ కంటోన్మెంట్