ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉంటే.. మాకు ఫిర్యాదు చేయండి : తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌

ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉంటే.. మాకు ఫిర్యాదు చేయండి : తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌

తెలుగు ఫిల్మ్, టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌గా ఉన్న కొరియోగ్రాఫర్‌‌‌‌ జానీ‌‌‌పై లైంగిక వేధింపు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మంగళవారం ప్రెస్‌‌‌‌మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా సెక్రటరీ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ వివాదం తేలే వరకు జానీ‌‌‌‌‌‌‌ను  డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌‌‌‌ను ఆదేశించాం. ఇలాంటి సమస్యల కోసమే 2018లో టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌‌‌‌ను మహిళలతో ఏర్పాటు చేశాం’ అని అన్నారు.

ఈ కమిటీకి చైర్మన్‌‌‌‌గా ఉన్న నటి ఝాన్సీ మాట్లాడుతూ ‘జానీ ఇష్యూ  గత రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉంది. బాధితురాలితో పాటు  జానీ స్టేట్‌‌‌‌మెంట్ కూడా రికార్డ్ చేశాం. ఈ సమస్యపై రకరకాల కోణాల్లో విచారణ చేస్తున్నాం. ఇండస్ట్రీలోని ప్రతి అమ్మాయికి మా కమిటీ అండగా ఉంటుంది. ఎవరైనా కంప్లైంట్ చేస్తే , వారి వివరాలు గోప్యంగా ఉంచి సమస్యను పరిష్కరిస్తాం’ అని చెప్పారు.

‘ఫిర్యాదులు చేసిన వారికి కూడా సినిమాల్లో అవకాశాలు ఉంటాయనే ధైర్యాన్ని తెలుగు చిత్రపరిశ్రమ ఇస్తోంది’ అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.  ఈ కార్యక్రమంలో నటి ప్రగతి, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల పాల్గొన్నారు.

త్రివిక్రమ్‌‌‌‌ను ప్రశ్నించాలి: పూనమ్ కౌర్

మరోవైపు ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన నటి పూనమ్ కౌర్...  గతంలో దర్శకుడు త్రివిక్రమ్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌పై తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌‌‌‌ (మా)లో కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌‌‌‌ను ప్రశ్నించాలని  ఆమె పోస్ట్ చేశారు.